కరస్పాండెంట్‌ను శిక్షించాలి
విద్యార్థినిపై లైంగికదాడికి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ,డీవైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం
ఒంగోలు టౌన్ : దర్శిలోని ప్రైవేట్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడి చేసిన కరస్పాండెంట్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా నగర కమిటీల ఆధ్వర్యంలో గురువారం స్థానిక లాయర్‌పేట సాయిబాబాగుడి సెంటర్‌లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా నగర కార్యదర్శులు పి.రాంబాబు, కేఎఫ్ బాబు, కె.రమాదేవిలు మాట్లాడుతూ దర్శిలోని ఎక్స్‌లెంట్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినిపై స్కూల్ కరస్పాండెంట్ అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా చేయడం సమాజానికి సిగ్గుచేటన్నారు. గురువులే కీచకులుగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారానికి గురైన విద్యార్థినికి తల్లిదండ్రులు లేరని, అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటుం దని, ఆ విద్యార్థినికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాం డ్‌చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు వినోద్, ఐద్వా నాయకురాళ్లు పి.కల్పన, రాజేశ్వరి, జి.ఆదిలక్ష్మి, ఎస్‌కే నాగూర్‌బీ, బి.గోవిందమ్మ పాల్గొన్నారు.