కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఎర్రచందనం దొంగలను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో జీరో వ్యాపారులు.. టమాటాల మాటున నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న లారీ విజి‘లెన్స్’కు చిక్కింది.అందులో సుమారు 200 బస్తాల గుట్కా పాకెట్లు ఉండడం చూసి అధికారులు విస్మయం చెందారు.
పట్టుబడిందెలాగంటే...
అనంతపురం నుంచి బెంగళూరుకు టమాటా లోడుతో వెళ్లిన ఏపీ 02- ఎక్స్ 6551 నంబర్ గల లారీ అక్కడ టమాటాల లోడును దింపిన అనంతరం తిరుగు ప్రయాణంలో టమాటాల రవాణాకు ఉపయోగించే ప్లాస్టిక్ పెట్టె(ట్రేస్)ల మాటున గుట్కా ప్యాకెట్ల బస్తాలతో కడపకు ప్రయాణమైంది. ఈ విషయం పసిగట్టిన కడప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం అప్రమత్తమైంది. లారీ కడప వైపునకు వస్తున్నట్లు అందిన సమాచారంతో కడప మరియాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మాటువేశారు. సరిగ్గా అదే సమయానికి లారీ రాగానే తమ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ రామకృష్ణ తెలి పారు.
అందులో 200 బస్తాలు ఉండగా, వాటి విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. అయితే బయటి మార్కెట్‌లో వాటిని విక్రయిస్తే రూ.70 లక్షలు వస్తుందని వెల్లడించారు. లారీని పాత రిమ్స్‌కు తరలించి, స్వాధీనం చేసుకున్న గుట్కా బస్తాలను భద్రపరచినట్లు చెప్పారు. ధర్మవరానికి చెందిన లారీ డ్రైవర్ చరణ్, క్లీనర్ సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
లారీ ధర్మవరం ప్రాంతానిదే..
గుట్కా బస్తాలను రవాణా చేస్తు విజి‘లెన్స్’కు చిక్కిన లారీ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముకుందారెడ్డికి చెందినదిగా డ్రైవర్ విచారణలో అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తి గుట్కా వ్యాపారం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. కాగా అక్రమ రవాణా ఎలా జరుగుతోందనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. దాడుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పుల్లయ్య, ఏఓ శశిధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
గుట్కా గుట్టు.. రట్టు
Published Tue, Jan 7 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement