tomato box
-
టమాటా సాగుతో కోటీశ్వరులు.. 45 రోజుల్లో రూ. 3 కోట్ల ఆదాయం
గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గత నెల రోజులుగా కొండెక్కి కూర్చున్న టమాటాధరలు.. ఎంతకీ దిగిరావడం లేదు. పోనూ పోనూ ఇంకా ప్రియంగా మారుతూ.. సామాన్యుడికి భారంగా మారింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.200 చేరి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. అయితే పెరిగిన టమాటా ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే.. వీటిని పండించిన రైతుల ఇంట మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కనివినీ ఎరగని రీతిలో కొంతమంది రైతులు ధనవంతులు అవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం టమాటా పంటతో జాక్‌పాట్ కొట్టింది. 22 ఎకరాల్లో టమాటాసాగు చేసి.. 45 రోజుల్లో ఏకంగా మూడుకోట్లు సంపాదించారు. భూదేవిని నమ్ముకున్న రైతులు ఏ రోజుకైనా రాజులవుతారని నిరూపించారు రైతులు చంద్రమౌళి, మురళి. చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకు చెందిన రైతు కుటుంబంలోని అన్నదమ్ములు చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. స్వగ్రామమైన కరకమంద సమీపంలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపు వారి పల్లెలో 10 ఎకరాల పొలంలో 23 సంవత్సరాలుగా టమాటను సాగు చేస్తున్నారు. చదవండి: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!! 22 ఎకరాల్లో టమాటా సాగు తన వంగడాలు, మార్కెట్ స్థితిగతుల గురించి బాగా అవగాహన పెంచుకున్న చంద్రమౌళి.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సంవత్సరం అరుదైన సాహు రకానికి చెందిన టమాటా మొక్కలను 22 ఎకరాలలో సాగు చేశారు. త్వరగా దిగుబడి పొందడానికి మల్చింగ్, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల వంటి అధునాతన పద్ధతులను అనుసారించాడు. దాదాపుగా 70 లక్షల వరకు పంటపై ఖర్చు చేయగా.. జూన్ చివరి వారంలో దిగుబడి ప్రారంభమైంది. రూ. 4 కోట్ల ఆదాయం.. ఖర్చులు పోనూ! ఈ పంటను తమ ప్రాంతానికి దగ్గరల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ మార్కెట్లో విక్రయించారు. అక్కడ 15 కేజీల బాక్స్ ధర వెయ్యి రూపాయల నుంచి 1500 మధ్య పలికింది. గత 45 రోజుల్లో సుమారుగా 40 వేల పెట్టెలు విక్రయించాడు. తనకొచ్చిన లాభంపై రైతు చంద్రమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ..ఇప్పటి వరకు పండించిన పంట ద్వారా రూ. 4 కోట్ల ఆదాయం వచ్చిందన్నాడు. మొత్తంగా 22 ఎకరాల్లో పంట కోసం అన్నీ ఖర్చులు కలిపి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టగా... రూ. 3 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ధరలు మరోవైపు భారత్‌లోనే అతిపెద్ద టమటా మార్కెట్లలో ఒకటిగా ఉన్న మదనపల్లెలో టమాట ధర విపరీతంగా పెరుగుతోంది. మొదటి గ్రేడ్ టమోటా కిలో ధర శుక్రవారం రూ. 200 రూపాయలు పలికింది. రెండు వారాల క్రితం కిలో టమాటారూ.120 ఉండగా.. 25 కిలోల డబ్బాను రూ.3 వేలకు విక్రయించారు. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో టమాటకు డిమాండ్ పెరగడంతో కిలో ధర రూ.200కి చేరింది. ఆగస్టు నెలాఖరు వరకు టమాటా ధరలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. చదవండి: సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం -
తెలంగాణలో టమాటాలు చోరీ.. తెల్లారేసరికి బాక్స్‌లు మాయం
సాక్షి, జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటాలకు ఎంతో డిమాండ్ ఉందో తెలిసిందే. కొన్ని కిలో టమాటాల ధర ఏకంగా రూ.200లకు పైనే పలికింది. ఈ క్రమంలో కొందరు టమాట రైతులు కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక, టమాటకు భారీ ధర పలుకుతున్న నేపథ్యంలో తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమ్ముకుందామని కూరగాయల మార్కెట్‌కు తెచ్చిన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్‌కు చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్‌కు తాను పండించిన టమాటాలను తీసుకువచ్చాడు. కాగా, శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. అయితే, శనివారం తెల్లవారుజామునే వచ్చి చూసేసరికి రూ.6,500 విలువైన మూడు టమాటా ట్రేలు కనిపించలేదు. అవి దొంగతనానికి గురయ్యయాయని గుర్తించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి టమాటా ట్రేలను ఎత్తుకెళ్తు గుర్తించారు. ఇక, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటాలు చోరీకి గురైన ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే.. మహారాష్ట్రలోని పుణెలో అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్‌కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్‌లన్నీ చోరీ అయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, తమిళనాడులో కూడా విలువైన టమాటాలు చోరీకి గురయ్యాయి. ఇది కూడా చదవండి: 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు.. -
రూ.కోటికి పైగా వచ్చింది..రూ.లక్షకు పైగా పోయింది
రంగల్/ కౌడిపల్లి: టమాటాకు ఎంత క్రేజీ ఉందో, ఒక్కోసారి అమ్మకాల్లేక, వర్షాలతో అంత డ్యామేజీకి గురవుతోంది. ఒకరింట సిరులు కురిపించగా, మరికొందరికి దిగులు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఓ రైతు టమాట పంట ద్వారా రూ.కోటి 20 లక్షలు సంపాదించగా, వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో టమాటాలు కుళ్లిపోవడంతో కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్ లోడ్ మేర పారబోశారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్‌కు రోజుకు 1,500–2,000 బాక్సుల టమాటా వస్తోంది. బాక్సు టమాటాను రూ.1,800– 2,500 హోల్‌సేల్‌గా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎత్తు టమాటా(2.5 కిలోలు) రూ.30–50 విక్రయించగా, కొద్దిరోజులుగా రూ.200–300 చొప్పున అమ్ముతుండటంతో వినియోగదారులెవరూ టమాటా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో శుక్రవారం రూ.లక్షకు పైగా విలువైన టమాటాలను చెత్త ట్రాక్టర్లో తీసుకొచ్చి బయట పారబోసినట్లు వ్యాపారులు తెలిపారు. ఇటు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి ఎనిమిదెకరాలలో టమాటా, నాలుగు ఎకరాలలో క్యాప్సికం సాగు చేస్తున్నారు. టమాటా ధర భారీగా పలకడంతో ఇప్పటికే రూ.కోటీ 20 లక్షలు సంపాదించారు. ఇంకా నలభై శాతం పంట పొలంలోనే ఉంది. నెల రోజులుగా రోజుకు రెండు వందల ట్రేల టమాటా దిగుబడి వస్తోంది. ట్రే టమాటా రూ.1,000 నుంచి రూ 3 వేలు ధర పలుకుతోంది. పంటసాగుకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పన రూ.16 లక్షలు ఖర్చు అయినట్లు మహిపాల్‌రెడ్డి చెప్పారు. ‘ఛత్తీస్‌గఢ్ నుంచి మొక్కలు తెచ్చి నాటడంతోపాటు ఎండను తట్టుకునేలా షెడ్ వేశా. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేశా. దీంతో మంచి లాభాలు వచ్చాయి’అని అన్నారు. -
టమాటాలు అమ్మి రూ. 38 లక్షలు.. రైతు పంట పండింది!
గత కొంత కాలంగా తక్కువ ధరకే లభించిన 'టమాట' ఇప్పుడు కొండెక్కింది. కేజీ ధర రూ. 150 నుంచి రూ. 180 వరకు వుంది. ఇది సామాన్యులకు కొంత కష్టంగా అనిపించినా.. ఎప్పటి నుంచో సరైన ధరల కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి. ఎన్ని పంటలు పండించినా రైతు అప్పులు పాటు అవుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు టమాట రైతుల మోహంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మంచి లాభాలను పొందుతున్నారు. ఇటీవల ఒక రైతు టమాటలు అమ్మి ఒకే రోజు ఏకంగా రూ. 38 లక్షల సొమ్ము కళ్ళ చూసినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కర్ణాటక కోలార్ ప్రాంతానికి చెందిన రైతు కుటుంభం ఒకే రోజు రూ. 38 లక్షల విలువైన టమాటాలు విక్రయించినట్లు తెలిసింది. బేతమంగళం జిల్లాలోని ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడు గత కొంత కాలంగా వారికున్న 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కో బాక్స్ రూ. 800కి విక్రయించారని.. ఆ తరువాత అత్యధిక ధర ఇదే అనే చెబుతున్నారు. (ఇదీ చదవండి: జీఎస్టీ సెస్ పెంపు.. ఆ కార్ల ధరలకు రెక్కలు - కొనుగోలుదారులకు చుక్కలు!) మంగళవారం వారు ఒక్కో బాక్స్ రూ. 1900కు మొత్తం 2000 బాక్సులు విక్రయించి రూ. 38 లక్షలు సొంతం చేసుకున్నారు. ఆ రైతులకు నాణ్యమైన టమాట ఎలా పండించాలో తెలుసనీ.. ఆ కారణంగానే పంటను తెగులు నుంచి కాపాడుకున్నామని వెల్లడించారు. మొత్తానికి టమాట వల్ల వారి ముఖాల్లో వెలుగు నిండిపోయింది. -
15 కేజీల టమాటా రూ.వెయ్యి..
సాక్షి, కోలారు: జిల్లావ్యాప్తంగా కొన్నిరోజులుగా కురుస్తున్న వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం. టమాటకు అతి పెద్ద విపణి అయిన కోలారు ఎపిఎంసి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికింది. 15 కేజీల టమోటా బాక్సు రూ.వెయ్యికి వేలం పాడడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వానల కారణంగా టమాట దిగుబడి తగ్గడంతో అక్కడి వ్యాపారులు సరుకు కోసం కోలారు మార్కెట్‌కు వస్తున్నారు. దీంతో టమాట లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల కిందట వరకు టమాట బాక్స్ రూ.250 కంటే తక్కువగానే ఉండేది. గిరాకీ లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక బయట కూరగాయల మార్కెట్లలో కేజీ ధర నాణ్యతను బట్టి రూ.70– 80 వరకూ ఉంటోంది. -
గుట్కా గుట్టు.. రట్టు
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఎర్రచందనం దొంగలను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో జీరో వ్యాపారులు.. టమాటాల మాటున నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న లారీ విజి‘లెన్స్’కు చిక్కింది.అందులో సుమారు 200 బస్తాల గుట్కా పాకెట్లు ఉండడం చూసి అధికారులు విస్మయం చెందారు. పట్టుబడిందెలాగంటే... అనంతపురం నుంచి బెంగళూరుకు టమాటా లోడుతో వెళ్లిన ఏపీ 02- ఎక్స్ 6551 నంబర్ గల లారీ అక్కడ టమాటాల లోడును దింపిన అనంతరం తిరుగు ప్రయాణంలో టమాటాల రవాణాకు ఉపయోగించే ప్లాస్టిక్ పెట్టె(ట్రేస్)ల మాటున గుట్కా ప్యాకెట్ల బస్తాలతో కడపకు ప్రయాణమైంది. ఈ విషయం పసిగట్టిన కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం అప్రమత్తమైంది. లారీ కడప వైపునకు వస్తున్నట్లు అందిన సమాచారంతో కడప మరియాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మాటువేశారు. సరిగ్గా అదే సమయానికి లారీ రాగానే తమ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ రామకృష్ణ తెలి పారు. అందులో 200 బస్తాలు ఉండగా, వాటి విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. అయితే బయటి మార్కెట్లో వాటిని విక్రయిస్తే రూ.70 లక్షలు వస్తుందని వెల్లడించారు. లారీని పాత రిమ్స్‌కు తరలించి, స్వాధీనం చేసుకున్న గుట్కా బస్తాలను భద్రపరచినట్లు చెప్పారు. ధర్మవరానికి చెందిన లారీ డ్రైవర్ చరణ్, క్లీనర్ సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లారీ ధర్మవరం ప్రాంతానిదే.. గుట్కా బస్తాలను రవాణా చేస్తు విజి‘లెన్స్’కు చిక్కిన లారీ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముకుందారెడ్డికి చెందినదిగా డ్రైవర్ విచారణలో అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తి గుట్కా వ్యాపారం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. కాగా అక్రమ రవాణా ఎలా జరుగుతోందనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ పుల్లయ్య, ఏఓ శశిధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.