మూలుగుతున్న ‘ప్రత్యేక’ నిధులు
సాక్షి, విశాఖపట్నం : అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు ప్రత్యేక నిధులతో సరి పెట్టేశారు. ఆ ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు విదిల్చిన నిధులొచ్చి ఏడు నెలయింది. వీటి వినియోగంపై మార్గదర్శకాలు జారీయి ఆరు నెలలు కావస్తోంది. అయినా సరే ప్రతిపాదనల దశ దాటలేదు. పైసా ఖర్చు కాలేదు. ఈ నిధుల వినియోగంపై కమిటీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంవల్లే ఈ పరిస్థితి నెలకొంది.
విభజన నేపథ్యంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేకప్యాకేజీ ఇస్తామని ఊరించారు. చివరకు ప్రత్యేక అభి ృద్ధి నిధుల పేరిట జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు విదిల్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది ఫిబ్రవరి 4న జిల్లాకు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఆ తరువాత మార్గదర్శకాలు కూడా జారీయ్యాయి. కానీ నేటికీ ఒక్క పైసా కూడా ఖర్చు కాని దుస్థితి నెలకొంది.
కలెక్టర్‌కే సర్వాధికారాలు
నిధుల వినియోగంపై సర్వాధికారాలు జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. ఈ నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ నిర్వహించాలి. యాక్షన్ ప్లాన్‌కనుగుణంగా ఎప్పటికప్పుడు యుటిలైజ్డ్ సర్టిఫికెట్లు సమర్పించడంతో పాటు ప్రత్యేకంగా ఆడిటింగ్ కూడా చేయాలి. ఈ నిధులను ఖర్చు చేసేందుకు కలెక్టర్ చైర్మన్‌గా ఒక మోనటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీకి చీఫ్ ఫ్లానింగ్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనుండగా, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల, పరిశ్రమలు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలతో పాటు అన్ని సంక్షేమ శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. శాఖల వారీగా రూపొందించే యాక్షన్ ప్లాన్‌పై చర్చించేందుకు మోనటరింగ్ కమిటీ కనీసం నెలకోసారి భేటీ కావాల్సి ఉంది. నిధులు కేటాయింపు, వినియోగంపై ప్రతీనెలా పర్యవేక్షిస్తుండడంతో పాటు ప్రత్యేకంగా కంప్యూటరైజేషన్ కూడా చేయాలి. కానీ నిధులు విడుదలై నెలలు గడుస్తున్నా జిల్లా స్థాయి మోనటరింగ్ కమిటీ భేటీ కాలేదు.
శాఖల వారీగా ప్రతిపాదనలు
ఇప్పటి వరకు శాఖల వారీగా ప్రతిపాదనలందాయి. ఫిషరీస్-రూ.3.75 కోట్లు, పశు సంవర్ధక శాఖ-రూ.21.12కోట్లు, డ్వామా- రూ.7.25 కోట్లు, అటవీశాఖ రూ.2.10 కోట్లు, డీఐసీ-రూ.25లక్షలు, ఏపీ టీడీసీ- రూ.3.10 కోట్లు, ఐటీడీఎ, పాడేరు- రూ.11కోట్లు, వ్యవసాయ శాఖ-రూ.10.50కోట్లు, విద్యా శాఖ-రూ.1.93 కోట్లు, సీపీఒ- రూ.50లక్షలు, బీసీ కార్పొరేషన్ రూ.1.83కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపించారు. వీటిపై జిల్లా స్థాయి మోనటరింగ్ కమిటీ భేటీ అయి శాఖల వారీగా పంపిన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ జిల్లా స్థాయి కమిటీ భేటీ జరగకపోవడం వలన ఈ ప్రత్యేక అభివృద్ధి నిధులు వినియోగం కాలేదు.
మంత్రుల నుంచి గ్రీన్‌సిగ్నెల్ లేకే!
మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రీన్‌సిగ్నెల్ రాక పోవడం వలనే ఈ నిధుల వినియోగంపై జిల్లా యంత్రాంగం జాప్యం చేస్తుందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాము సూచించిన పనులకే ఈ నిధులు కేటాయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ నిధుల వినియో గంపై దృష్టి సారిం చాల్సిన అవసరం ఉంది. 2014-15 ఆర్ధికసంవత్సరం నిధులు ఖర్చు కాలేదు. మరొక పక్క 2015-16 ఆర్ధిక సంవత్సరానికి కూడా త్వరలో మరో రూ.50 కోట్ల చొప్పున నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయి.