లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే అంశాన్ని కేంద్ర కేబినేట్ సవరించింది. ఇప్పుడున్న నియోజకవర్గాలకే ఈసారి ఎన్నికలు జరుగుతాయని, తర్వాతే పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేసింది. ముసాయిదా బిల్లులో నియోజకవర్గాల జాబితాలో ఉన్న ధర్మపురి సెగ్మెంట్ పేరును ధర్మపురి (ఎస్సీ రిజర్వుడు)గా సవరించింది. దీంతో జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులకు ఆస్కారం లేదని తేలిపోయింది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడున్న 119 స్థానాలుండగా, 153కు పెంచాలనే డిమాండ్‌ను పరిశీలించిన కేబినేట్ సాధారణ ఎన్నికల తర్వాతే పునర్విభజన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. దీంతో 2019 ఎన్నికల నాటికి అదే దామాషా ప్రకారం జిల్లాలోనూ రెండు లేదా మూడు నియోజకవర్గాలు పెరిగే అవకాశముంది.
ప్రస్తుతం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో మానకొండూరు, చొప్పదండి, ధర్మపురి ఎస్సీ రిజర్వుడు స్థానాలు. తాజా నిర్ణయంతో ఈ సెగ్మెంట్లకు యథాతథంగా ఎన్నికలు జరుగనుండటంతో ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
తమ స్థానాలు చెదిరిపోతాయనే అనుమానాలు తొలిగిపోవటంతో పోటీకి ఉరకలేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో విజేతలతో పోటీపడ్డ ప్రత్యర్థులు సైతం నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. నిన్నటివరకు పునర్విభజన దడతో వెనుకడుగు వేసిన అభ్యర్థులు సైతం తమకు లైన్ క్లియర్ అయిందంటూ ఎన్నికల సరంజామా సర్దుకుంటున్నారు.
ఈ నెలాఖరులోనే ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందనే ప్రచారం జరుగుతోంది. జిల్లా యంత్రాంగం సైతం ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. అదే సమయంలో ప్రధాన పార్టీలన్నింటా ఎన్నికల కోలాహలం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా అభ్యర్థిత్వాలపై కసరత్తు ప్రారంభించింది.
పార్టీ పరిశీలకులు రహస్యంగా రాహుల్ దూతల పర్యటనలతో ఎవరు ఎక్కణ్నుంచి పోటీ చేస్తారు? ఎవరికి టిక్కెట్టు దక్కుతుంది? అనే ఉత్కంఠ నెలకొంది.
అదే సమయంలో టీఆర్‌ఎస్ విలీనమైతే ఎవరెవరి సీట్లు ఎవరెవరు పోటీ చేయాలనే విషయంలోనూ ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా అంచనాలు వేసుకుంటున్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు విప్ ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
టీఆర్‌ఎస్ తరఫున అత్యధికంగా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేశ్, విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ తమ తమ స్థానాల్లో పాతుకుపోయారు. దీంతో రెండు పార్టీలు ఒక్కటైతే బలం, బలగం పెరిగిపోతుందనే ధీమా ముఖ్య నేతల్లో వ్యక్తమవుతోంది. కానీ రెండు పార్టీలకు ముఖ్య నేతలున్న హుస్నాబాద్, కోరుట్ల, సిరిసిల్ల నియోజకవర్గాలలో సర్దుబాటు కొంత తలనొప్పిగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పాటు జిల్లాలో ముగ్గురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఈసారి బీజేపీతో పొత్తు కుదురుతుందనే ధీమాతో ఎల్.రమణ, విజయరమణారావు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. పార్టీ మారుతారంటూ పలుమార్లు వార్తల్లోకెక్కిన సుద్దాల దేవయ్య ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. తనకు బదులుగా తన కుమారుడు గౌతమ్‌ను రాజకీయాల్లోకి దింపే ఆలోచనతో ఉన్నారని, చివరి క్షణం వరకు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయంలో తేల్చుకోలేకపోతున్నారనే ప్రచారం చొప్పదండి సెగ్మెంట్‌లోని టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. నరేంద్రమోడీపై పెరిగిన ఆకర్షణను ప్రచారాస్త్రంగా ఎంచుకున్న బీజేపీ సైతం ఈసారి అన్ని సెగ్మెంట్ల నుంచి అభ్యర్థులను సిద్ధం చేస్తోంది. టీడీపీతో పొత్తు కూడితే ముఖ్య నేతలను ఎక్కడినుంచి బరిలోకి దింపాలనే విషయంలోనూ ముందస్తు కసరత్తు చేసింది.
చెదరని సెగ్మెంట్లు
Published Sun, Feb 9 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement