హత్య పుకార్లు నిజమే
ముండ్లమూరు : మండలంలోని బొప్పూడివారిపాలెం గ్రామంలో ఓ యువకుడిని కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పది రోజులుగా వస్తున్న పుకార్లు నిజమయ్యాయి. గ్రామంలో హత్య జరిగినట్లు ఈ నెల 6వ తేదీ నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, దానికి సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం, ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో ఏ ఒక్కరూ స్పందించలేదు. చివరకు గ్రామానికి చెందిన వల్లభనేని శ్రీనివాసరావు అనే వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ టీవీవీ ప్రతాప్‌కుమార్, స్థానిక ఎస్సై ఎన్.రాఘవరావులు వారం రోజుల క్రితం గ్రామాన్ని సందర్శించి స్థానికులను విచారించారు. గ్రామానికి చెందిన కూచి శ్రీనివాసరావు (21) గత నెల 31వ తేదీ చనిపోయినట్లు విచారణలో తేలడంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన చిలకలే రువాగు సమీపంలోని ప్రాంతానికి శనివారం చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుడు రకాజ్‌కుమార్, స్థానిక తహశీల్దార్ కేవీ కృష్ణారావు సమక్షంలో బొప్పూడివారిపాలెం-ఈదర గ్రామాల మధ్య చిలకలేరువాగు సమీపంలో పూడ్చిపెట్టిన కూచి శ్రీనివాసరావు మృతదేహాన్ని వెలికితీయించారు.
శవపంచనామా నిర్వహించి పరీక్షల నిమిత్తం అవయవాలను భద్రపరిచారు. దీనికి సంబంధించి సీఐ ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ బొప్పూడివారిపాలెం గ్రామానికి చెందిన కూచి శ్రీనివాసరావును కుటుంబ కలహాల నేపథ్యంలో అతని తండ్రి కూచి చినబుల్లబ్బాయి, బావ వల్లపునేని రమేష్, స్నేహితుడు లామ్ హనుమంతరావులు గత నెల 31వ తేదీ హత్య చేయించి చిలకలే రువాగు సమీపంలో పూడ్చిపెట్టినట్లు స్థానికుల నుంచి తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఆ మేరకు హత్యకేసు నమోదు చేసి మృతదేహాన్ని వెలికితీయించి నిపుణులతో పరీక్షలు చేయిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పూర్తిచేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
కుటుంబ సభ్యులే హంతకులా..?
కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో కూచి శ్రీనివాసరావును అతని కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామానికి చెందిన కూచి బుల్లబ్బాయి, సుశీల దంపతుల కుమారుడైన శ్రీనివాసరావు డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అతని అక్క.. మొదటి భర్త నుంచి విడిపోవడంతో అదే గ్రామానికి చెందిన వల్లపునేని రమేష్‌కిచ్చి రెండో వివాహం చేశారు. ఆ సమయంలో రమేష్‌కు మూడు ఎకరాల పొలం ఇచ్చేందుకు అంగీకరించారు.
అయితే, పొలం ఇవ్వడాన్ని శ్రీనివాసరావు వ్యతిరేకిస్తున్నాడు. దీనికితోడు సరదాలకు తగినంత డబ్బు ఇవ్వడంలేదని పలుమార్లు త ల్లిదండ్రులపై చేయిచేసుకున్నాడు. దీంతో అతని తల్లిదండ్రులు, అక్కబావలు ఒక్కటై శ్రీనివాసరావును అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్‌చేశారు. గ్రామానికి చెంది వినుకొండలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్న అతని స్నేహితుడైన లామ్ హనుమంతరావు ద్వారా కిరాయి హంతకులను మాట్లాడి హత్య చేయించి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టించినట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. హత్య జరిగిందని ఫిర్యాదు చేసిన వల్లభనేని శ్రీనివాసరావు కూడా ఈ వివరాలన్నింటినీ పోలీసులకు చెప్పడంతో ఆ మేరకు వారు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.