మృతదేహం వెలికితీతను పరిశీలిస్తున్న ఎస్‌ఐ వీర్రాజు, ఆర్‌ఐ సౌజన్యరాణి (ఇన్ సెట్‌లో) కోట రామలక్ష్మి
భీమడోలు: భార్యను హత్య చేసి.. శవాన్ని ఇంటి ఆవరణలోనే ఉప్పు పాతరేశాడో భర్త. పశ్చిమగోదావరి జిల్లా పోలసానిపల్లిలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన విషయాన్ని నిందితుడు మద్యం మత్తులో నోరు జారడంతో ఆ నోటా ఈ నోటా గ్రామంలో వ్యాపించింది. దీంతో చేసేది లేక నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. అధికారులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసుల కథనం ప్రకారం.. పోలసానిపల్లి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ కోట శ్రీనివాసరావుకు పెదవేగి మండలం మొండూరులోని అక్క కూతురైన రామలక్ష్మితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భార్యపై అనుమానంతో శ్రీనివాసరావు తరచూ గొడవలు పడుతూ వేధిస్తుండేవాడు.
ఈ నెల 19వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యపై బలవంతంగా శారీరక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. శవానికి దుప్పటి చుట్టి మంచం కింద దాచేశాడు. ఉదయాన్నే ఇద్దరు పిల్లలను మొండూరులో అత్తగారింట్లో వదిలి వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన తమ్ముడు నాగరాజు, మరదలుకు పరిస్థితిని చెప్పాడు. వారి సహకారంతో తన ఇంటి ఆవరణలో నీటి ట్యాంకు నిర్మించేందుకని ఇద్దరు కూలీలతో ఏడు అడుగుల లోతు గోతిని తవ్వించాడు.
అనంతరం మృతదేహాన్ని నిందితుడు శ్రీనివాసరావు గోతిలో పడేసి వాసన రాకుండా ఉప్పు పాతర వేశాడు. స్వతహాగా తాపీ మేస్త్రి కావడంతో రాళ్లు, బండలతో సిమెంట్ వేసి సమాధి కట్టేశాడు. గ్రామంలోని వారికి తన భార్య ఇల్లు వదిలి వెళ్లి పోయిందని ప్రచారం చేశాడు. రెండు రోజుల కిందట మద్యం మత్తులో భార్యను తానే చంపి పాతి పెట్టానని ఒకరిద్దరితో చెప్పాడు. అలా అందరికీ తెలిసిపోవడంతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గోతిలో పాతిపెట్టిన రామలక్ష్మి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment