బ్యాంకులకు చేరిన రుణమాఫీ జాబితాలు
వీటిలోనూ తప్పుల తడకలే!
నోటీసుబోర్డులో పెట్టని వైనం
రుణమాఫీ అంశంపై అదే గందరగోళంగా కొనసాగుతోంది. జాబితాలు మొదట రెవెన్యూ శాఖకు విడుదల చేసినా.. ఇప్పుడు బ్యాంకులకు పంపించినా.. వాటిలో స్పష్టత కొరవడింది. వాటిగురించి స్పష్టమైన సమాచారం ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు. దీంతో తమకు రుణమాఫీ జరుగుతుందా, లేదా అన్న సంశయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
మచిలీపట్నం : ఇటీవల ప్రభుత్వం నుంచి బ్యాంకులకు రుణమాఫీ జాబితా పంపారు. జాబితాలు పంపిన ప్రభుత్వం వీటిని బ్యాంకుల వద్ద నోటీసు బోర్డుల్లో ఉంచాలా, లేదా అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు జాబితాను ప్రదర్శించకుండా నిలిపివేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక వాటిని బయటపెడతామని చెబుతున్నారు. ప్రస్తుత జాబితాలో అర్హత ఉన్న రైతుల పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో తమకు రుణమాఫీ జరుగుతుందా, లేదా అన్న సంశయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రెండో జాబితా ఉంటుందని అధికారులు చెబుతున్నా అది ఎప్పటిలోగా విడుదల చేస్తారనే అంశంపైనా స్పష్టత లేదు.
సగం మందికి పైగా రైతుల పేర్లు లేవు...
బందరు మండలం కానూరు పీఏసీఎస్‌లో 650 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడత జాబితాలో 345 మంది రుణమాఫీ పొందేందుకు అర్హులని ఈ సొసైటీకి ప్రభుత్వం ద్వారా ఆన్‌లైన్‌లో జాబితా వచ్చింది. ఈ జాబితాలో మిగిలిన రైతుల పేర్లు లేకపోవటంతో తాము రుణమాఫీ పొందేందుకు అర్హులమేనని, తమ పేర్లను రుణమాఫీ అర్హుల జాబితాలో చేర్చాలని రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
కొలమానం పాటిస్తారా...
ప్రస్తుతం జరిగే రుణమాఫీలో కొలమానం ప్రకారం రుణమాఫీ జరుగుతుందనే వాదన వినబడుతోంది. ఒక కుటుంబంలోని సభ్యులకు ఎంత భూమి ఉన్నా ఆ కుటుంబానికి 1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కుటుంబం సాగుచేసిన భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం, కుటుంబ సభ్యులందరికీ ఆధార్ నంబరును బట్టి రుణమాఫీ జరుగుతుందనే వాదన వినబడుతోంది. ఒక కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంటే అందులో మూడు ఎకరాలకు పట్టాదారు పాస్‌పుస్తకం, ఐబీ ఖాతా ఉండి మిగిలిన రెండు ఎకరాలు అసైన్డ్ భూమిగా ఉండి దానికి పట్టాదారు పాస్‌పుస్తకం లేకుంటే ఈ రెండు ఎకరాలకు సంబంధించి రుణమాఫీ జరగదనే వాదన వినబడుతోంది. ఈ కొలమానం పట్టాదారు పాస్‌పుస్తకం లేని భూమికి వర్తించదని బ్యాంకు అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు.
అంతా అయోమయం...
ప్రభుత్వం బ్యాంకులకు పంపిన జాబితా ఒక రకంగా ఉండగా, రెవెన్యూ అధికారులు గ్రామస్థాయిలో విచారణ చేసి పంపే జాబితాలు వేరే విధంగా ఉన్నాయని పలువురు పీఏసీఎస్ అధ్యక్షులు చెబుతున్నారు. ప్రభుత్వం బ్యాంకులకు పంపిన జాబితాలో అర్హులుగా ఉన్న వారి పేర్లు, రెవెన్యూ అధికారుల పరిశీలనలో అనర్హులుగా వస్తున్నాయని కొన్ని కొత్త పేర్లు చేరుతున్నాయని వారు పేర్కొంటున్నారు. నూజివీడులోని కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారి పేర్లు రుణమాఫీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం పంపిన, రెవెన్యూ అధికారులు తయారు చేసిన జాబితాలకు పొంతన లేకపోవటంతో బ్యాంకు అధికారులు ఈ జాబితాలను బయటపెట్టేందుకు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. మొదటి విడత జాబితా వివరాలను ఇంకా ఆన్‌లైన్‌లో ఉంచలేదు.
అదే గందరగోళం
Published Sun, Nov 30 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement