=కోర్టు ఆదేశాలతో ఒకరు
=పీవో ఆదేశాలతో మరొకరు
=సిబ్బంది, విద్యార్థుల అవస్థ
నాతవరం, న్యూస్‌లైన్: ఒకే పాఠశాలకు ఇద్దరు ప్రత్యేకాధికారులుండటంతో విద్యార్థులు, సిబ్బందికి తలనొప్పిగా పరిణమించింది. ఇక్కడి కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారిగా పనిచేసిన రామలక్ష్మిపై పలు ఆరోపణలు రావడంతో మాకవరపాలెం హైస్కూల్‌కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో స్థానిక హైస్కూల్‌లో పనిచేస్తున్న జి.మల్లీశ్వరిని జులై 3న ఇన్‌చార్జిగా నియమించారు. జిల్లాలో ఇన్‌చార్జిగా పనిచేస్తున్న 10 కస్తూర్బా పాఠశాలలకు రెగ్యులర్ ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు కోర్టును ఆశ్రయించారు. జిల్లాలో పనిచేస్తున్న తొమ్మిది మందిని అవే పాఠశాలల్లో యథావిధిగా విధులు నిర్వహించాలని ఆదేశాలు రావడంతో వారు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. నాతవరంలో పనిచేస్తున్న ప్రత్యేకాధికారి మల్లీశ్వరికి నిర్ణీత సమయం ప్రకారం కోర్టు ఆదేశాలు రాలేదు. దీంతో ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని శాంతిని కొత్త నియామకాల్లో ఎంపిక చేశారు. ఈ మేరకు ఈమెకు ప్రత్యేకాధికారిగా అధికారులు నియామక ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ నెల 26న విధుల్లో చేరారు.
ఇక్కడ గతంలో ఇన్‌చార్జిగా పనిచేసిన మల్లీశ్వరి ఇదే పాఠశాలలో ఏప్రిల్ 23 వరకు యథావిధిగా కొనసాగాలంటూ కోర్టు ఆదేశాలు వచ్చాయి. దాంతో ఈమె కూడా యథావిధిగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై మల్లీశ్వరిని న్యూస్‌లైన్ వివరణ కోరగా కోర్టు ఆదేశాలతో యథావిధిగా విధుల్లో కొనసాగుతున్నానని, గతంలో తనను రిలీవ్ చేయలేదని తెలిపారు. శాంతిని వివరణ కోరగా జిల్లా ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు 26న విధుల్లో చేరానన్నారు. ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావును ఫోన్‌లో సంప్రదించగా సమాధానమివ్వకుండా దాట వేశారు.
పాఠశాల ఒకటే... అధికారులు ఇద్దరు
Published Tue, Dec 31 2013 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement