సాక్షి, కర్నూలు: వర్షంలోనూ సమైక్య నినాదాలు హోరెత్తాయి. సమైక్యవాదులు స్వాతంత్య్ర సంబరాల్లో పాల్పంచుకుంటూనే.. ఉద్యమంలోనూ భాగస్వాములయ్యారు. రాష్ట్ర విభజనపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉద్యోగులు.. విద్యార్థులు.. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. రహదారులను దిగ్బంధిస్తూ.. వంటావార్పు చేపడుతూ కలిసి రాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కర్నూలు నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఆదోనిలో ఉద్యోగులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూనే.. ఉద్యమ ఆందోళనలను చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్ద జేఏసీ నాయకులు మువ్వన్నెల జెండా.. ఆ తర్వాత సమైక్యాంద్ర జెండా ఎగురవేశారు. జాతీయ గీతాలాపన పూర్వయ్యాక సమైక్యాంద్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
విద్యార్థి సంఘాల జేఏసీ ఆద్వర్యంలో విద్యార్థులు పట్టణంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ఆలూరు మండల కేంద్రంలో రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్ష చేపట్టగా మాజీ సైనికోద్యోగులు మద్దతు పలికారు. ఆత్మకూరులో జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
వెలుగోడులోని పొట్టిశ్రీరాములు సెంటర్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. బనగానపల్లెలో రజక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష, ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మోటర్‌బైక్‌ల ర్యాలీ చేపట్టారు. పత్తికొండలో జేఏసీ ఆధ్వర్యంలో ఏపీఎస్‌ఆర్‌టిసీ కార్మికులు, క్రీడాకారులు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదగా నాలుగు స్తంభాల వరకు ర్యాలీ నిర్వహించారు. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు జేఏసీకి మద్దతుగా 10 మంది దీక్ష చెపట్టారు. గాంధీ వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేవనకొండలో జేఏసీ ఉద్యమాలకు మద్దతుగా ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఎమ్మిగనూరులో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు.
విభజనను నిరసిస్తూ ఎల్‌ఐసీ ఏజెంట్లు వర్షంలోనూ కార్యాలయం నుండి శివ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. సి.బెళగల్‌లో వస్త్ర దుకాణం, టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గూడూరులో తాపీ వర్కర్లు సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. కోడుమూరులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి జూనియర్ కళాశాల లెక్చరర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఉద్యమ స్ఫూర్తి
Published Fri, Aug 16 2013 5:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement