సాక్షి, నెల్లూరు: రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. మరోవైపు వడగాలులు సైతం ప్రతాపం చూపుతున్నాయి. ప్రమాదవశాత్తు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ .. ఇలా కారణాలేవైనప్పటికీ జిల్లాలో అగ్నిప్రమాదాలు అధికమౌతున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 120 నుంచి 140 వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అధికారులకు ఫోన్‌కాల్స్ రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 200 కాల్స్ నమోదు అయ్యాయంటే ప్రమాదాల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకే రోజు 25 ఘటనలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చిన సందర్భం కూడా ఉంది.
అయితే పరిస్థితికి తగినట్టుగా జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 45 ఫైర్‌మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపినా అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. కొన్ని అగ్నిమాపక కేంద్రాల్లో బోర్లు ఏర్పాటు చేసినా వాటిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో ప్రమాదాలు జరిగిన సమయంలో నీటి సేకరణ కోసం సిబ్బంది పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
మరిన్ని అగ్నిమాపక కేంద్రాలు అవసరం
జిల్లాలో ప్రస్తుతం మర్రిపాడు, ఉదయగిరి, ఆత్మకూరు, వింజమూరు, కావలి, నెల్లూరు, గూడూరు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, రాపూరు, పొదలకూరులో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి.
ప్రమాదాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వీటిలోని అగ్నిమాపక వాహనాలు సకాలంలో వెళ్లి సేవలందించలే కపోతున్నాయి. చాలా చోట్ల ప్రమాదాలు జరిగిన సమయంలో ఫైరింజన్లు వెళ్లేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మరోవైపు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి జోరుగా సాగుతోంది. పలు పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం వెంకటాచలం, కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెం, నెల్లూరులోని టీబీ ఆస్పత్రి ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అత్యాధునిక పరికరాల కొరత
అగ్నిప్రమాదాలు సంభవించినపుడు మంటలను ఆర్పేందుకు, ప్రాణనష్టాన్ని నివారించేందుకు అవసరమయ్యే ఆధునిక యంత్ర పరికరాలు(రెస్క్యూ ఎక్విప్‌మెంట్) ప్రస్తుతం జిల్లాలో తగినన్ని లేవు. మరోవైపు అపార్టుమెంట్లు, భారీ షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో ప్రమాదాలు జరిగినా స్కైలిఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో రూ.3 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు అవసరమని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కనీసం 25 మీటర్ల ఎత్తులో మంటలను ఆర్పేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చాలని కోరారు. ఇరుకు వీధుల్లో ప్రమాదాలు సంభవించినా త్వరితగతిన వెళ్లేందుకు క్విక్ రెస్పాన్స్ వాహనం మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది.
సకాలంలో స్పందిస్తున్నాం
అగ్నిమాపక శాఖ సిబ్బంది కేవలం మంటలను ఆర్పడానికే పరిమితం కావడం లేదు. ఎవరు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా మాకు సమాచారం అందిస్తే స్పందిస్తున్నాం. ఇటీవల వెంకటాచలం సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. మా వద్ద ఉన్న ప్రత్యేకమైన పరికరాల సహాయంతో అతన్ని బయటకు తీసి ప్రాణాలు కాపాడగలిగాం.
జి.శ్రీనివాస్, డీఎఫ్‌ఓ
సిబ్బంది లేక ఇబ్బంది
Published Thu, May 29 2014 2:19 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement