ప్రభుత్వ లాంఛనాలతో విజయకృష్ణ అంత్యక్రియలు
తిరువూరు, న్యూస్‌లైన్ : చెన్నైలో మృతిచెందిన అస్సాంలోని భోజ్‌పూర్ డీఐజీ రామిశెట్టి విజయకృష్ణ అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన తిరువూరులో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో కాలేయ సంబంధ వ్యాధితో చికిత్స పొందారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో శనివారం మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని అంబులెన్సులో తిరువూరు తీసుకొచ్చారు.
రిటైర్డు అటవీ అధికారి రామిశెట్టి శ్రీరాములు రెండో కుమారుడైన విజయకృష్ణ మృతదేహానికి జాతీయ పతాకం కప్పి, పూలమాలలు వేసి ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్‌మాన్‌సింగ్, అస్సాం అడిషనల్ డీఐజీ అనురాగ్ అగర్వాల్, ఏపీఎస్‌పీ బెటాలియన్ అధికారులు మహేష్‌లడ్డా, అజయ్‌కుమార్ విక్రమ్, చెన్నై మీడియా చీఫ్ మయూరీ సిన్హా, అడిషనల్ డీజీపీ చంద్రనాథ్, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రథర్‌బాబు, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కంచి రామారావు నివాళులర్పించారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
విజయకృష్ణ మృతదేహానికి తిరువూరు సమీపంలోని మామిడితోటలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. విజయకృష్ణ తండ్రి రామిశెట్టి శ్రీరాములు చితికి నిప్పంటించారు. పట్టణ ప్రధానవీధుల్లో ప్రత్యేక వాహనంపై ఉంచిన విజయకృష్ణ మృతదేహాన్ని అంతిమయాత్ర నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రిటైర్డు ఉద్యోగులు, పోలీసు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
శోకసంద్రమైన తిరువూరు...
అందరికీ చిరపరిచితులైన రిటైర్డు అటవీ అధికారి రామిశెట్టి శ్రీరాములు రెండో కుమారుడు, అస్సాం కేడర్ ఐపీఎస్ అధికారి రామిశెట్టి విజయకృష్ణ (43) మృతితో తిరువూరులో విషాదం అలుముకుంది. చెన్నై నుంచి విజయకృష్ణ మృతదేహాన్ని తిరువూరు తీసుకువస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న వెంటనే పలు ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులు ఆయన నివాసానికి చేరుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. విజయకృష్ణ భార్య లీలారాణి, కుమారులు శ్రీరాం, బలరాంతేజ్‌ను పోలీసు ఉన్నతాధికారులు ఓదార్చారు.