అయ్యో మిత్రా!
ఉపాధి కోల్పోయినవారు
► సర్కారు ఆపరేషన్ సక్సెస్..
► జిల్లాలో 215 మంది ఆరోగ్యమిత్రలపై వేటు
► 8 ఏళ్ల సర్వీసు ఒక్క జీవోతో పోయె
► తమ అనుకూలుర కోసమే ఈ పన్నాగం
► మా కుటుంబాలను రోడ్డున పడేశారని బాధితుల ఆగ్రహం
► నేటి నుంచి ఆందోళన పథం!.. కోర్టుకు వెళ్లే యోచన
ఎనిమిదేళ్ల అనుభవం.. ఇన్నాళ్లూ చేసిన సేవలు.. ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు.. అన్నీ ఒక్క జీవోతో కొట్టుకుపోయాయి. వందలమంది చిరుద్యోగులను రోడ్డున పడేశాయి. అధికార పార్టీకి అనుకూలమైన వారిని నియమించుకునేందుకు సర్కారు పన్నిన కుట్రకు వైద్యమిత్రలు బలయ్యారు. వయసురీత్యా ఇప్పుడు వేరే ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమేనని వారు కన్నీరు పెట్టుకుంటున్నారు.
విశాఖపట్నం: వైద్యమిత్రలు రోడ్డున పడ్డారు. కాదు.. ప్రభుత్వమే వారిని రోడ్డున పడేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. ఆరోగ్యమిత్రలను వైద్యమిత్రలుగానూ మార్చింది. పేరుదేముందిలే అనుకుంటే.. ఇప్పుడు వారిని ఇంటికి సాగనంపే జీవో జారీ చేసింది. కొద్ది రోజుల నుంచి వీరిని తొలగిస్తారన్న ప్రచారం జరుగుతున్నా.. ప్రభుత్వం తమ క డుపు కొట్టే నిర్ణయం తీసుకోదన్న ఆశతో వీరున్నారు. వారి ఆశలను తుంచేస్తూ జీవో జారీ చేయడంతో అంతా షాక్ తిన్నారు. విశాఖ జిల్లా, నగరంలో కలిపి ఎన్టీఆర్ వైద్యసేవలో 216 మంది వైద్యమిత్రలు సేవలందిస్తున్నారు. వీరిలో ఒకరు జిల్లా మేనేజర్. నెట్‌వర్క్ వైద్యమిత్రలకు రూ.7300, పీహెచ్‌సీ వైద్యమిత్రలకు రూ.6200, టీమ్ లీడర్లకు రూ.10 వేలు, డీఎంకు రూ.20 వేలు చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. డీఎం, టీమ్ లీడర్లు, డివిజనల్ టీమ్ లీడర్లను ఎంబీఏ అర్హత, నెట్‌వర్క్, పీహెచ్‌సీ వైద్యమిత్రలను డిగ్రీ అర్హతతో 2007లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అప్పట్నుంచి వీరు విధులు నిర్వర్తిస్తూ ఎంతో అనుభవాన్ని గడించారు. కాగా తెలంగాణలో వీరంతా ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రలుగానే కొనసాగుతున్నారు. పైగా వారికి ఈ ఏడాది 40 శాతం జీతాలు పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న తమను అర్హతల మెలికతో రోడ్డున పడేశారని వైద్యమిత్రలు ఆందోళన చెందుతున్నారు.
నిలిచిపోయిన సేవలు
ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స పొందే రోగులకు వైద్యమిత్రలు మార్గదర్శకులుగా వ్యవహరించేవారు. వైద్యానికి వచ్చే వారికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో చేర్చేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయించి, వారికి వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో చూసేవారు. రోగి ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేదాకా అన్నింటికీ వీరే బాధ్యత వహించేవారు. ఇన్నాళ్లూ తెల్ల రేషన్‌కార్డుదారులకే సేవలందించిన వీరు కొన్నాళ్ల నుంచి ప్రభుత్వోద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్‌కార్డుల పథకంలో చికిత్స కోసం వచ్చే వారికి కూడా సహకారం అందిస్తూవచ్చారు. ఉన్న పళంగా వీరిని తొలగించడంతో బుధవారం నుంచి ఆస్పత్రుల్లో ైవె ద్యమిత్రల సేవలు నిలిచిపోయాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలకు సంబంధించి మార్గదర్శనం చేసేవారే లేకుండా పోయారు. కొత్తగా వైద్యమిత్రల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసి, నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి మరో నెలరోజులైనా పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటిదాకా ఎన్టీఆర్ వైద్య సేవలు పొందేవారి పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది.
అయిన వారి కోసమేనా?
వైద్యమిత్రలను తొలగించి వారి స్థానంలో తమవారిని నియమించుకోవాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నియమితులైన వైద్యమిత్రలపై ఎలాగైనా వేటు వేయాలన్న లక్ష్యంతోనే అర్హతల మార్పును తెరపైకి తీసుకొచ్చిందంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సువారు కావాలని ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందని.. అదే కొలమానంఅయితే గత ఎనిమిదేళ్లుగా తాము ఎలా సేవలందించగలిగామని బాధిత వైద్యమిత్రలు ఆగ్ర హంతో ప్రశ్నిస్తున్నారు.
ఆందోళనపథంలో..
తక్కువ జీతాలు ఇస్తున్నా ఈ ఉద్యోగాలనే నమ్ముకుని భార్యాపిల్లలతో నెట్టుకువస్తున్న తమను తొలగించడం అన్యాయమని వీరు ఆవేదన చెందుతున్నారు. దీనిపై భవిష్యత్ కార్యచరణకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో వైద్యమిత్రలు కోర్టుకు వెళ్లే యోచన చేస్తున్నారు. గురువారం నుంచి కలెక్టరేట్ వద్ద దీక్ష లు చేపట్టాలని భావిస్తున్నారు.
మా ఉసురు తగులుతుంది..
ఎనిమిదేళ్లుగా ఈ ఉద్యోగాన్నే నమ్ముకుని విధులు నిర్వర్తిస్తున్నాం. రోగులకు సంపూర్ణ సేవలందిస్తూ సాయపడుతున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా ఉద్యోగంలోంచి తీసేశారు. అప్పట్లోనే తీసేస్తే వేరో ఉద్యోగం వెతుక్కునే వారం. మాకు వయసు దాటిపోయింది. ఇప్పుడెవరు ఉద్యోగం ఇస్తారు? మా పిల్లల చదువులు ఆగిపోతాయి. ఎనిమిదేళ్లుగా జీతాలు పెంచలేదు సరికదా ఇప్పుడు ఇంటికి పంపేశారు. మా పొట్టకొట్టి బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికిస్తారట. ఎన్టీఆర్ వైద్య సేవను తల్లిలా నమ్ముకున్నాం. మమల్ని రోడ్డున పడేశారు. మా ఉసురు తగులుతుంది. -విజయ, పీహెచ్‌సీ వైద్యమిత్ర