విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మూడో రోజు కూడా జరగలేదు. పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు బుధవారం విధులకు గైర్హాజరు కావడంతో ప్రక్రియకు ఆటంకం తప్పలేదు. ఏపీ ఎన్జీజీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు నగరంలో సభ నిర్వహించడంతో సమైక్యవాదులంతా తరలి వెళ్లారు. కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద సమైక్యవాదుల తాకిడి స్వల్పంగా ఉండడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కంచరపాలెం ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల సిబ్బంది వీరికి అడ్డుపడ్డారు.
పోలీసులు లోపలికి వెళ్లడానికి నిరాకరించడంతో తల్లిదండ్రులు ఎదురు తిరిగారు. ఎన్నాళ్లీ ఉద్యమాలు అంటూ మండిపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారా! అని ఎదురుదాడికి దిగారు. సీమాంధ్ర ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్గొంటే ఇతర జిల్లాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లోపలికి అనుమతిస్తే కళాశాల ప్రతినిధులతో మాట్లాడతామని కోరడంతో కొంత మందిని పంపించారు. తల్లిదండ్రుల ఆవేదన తనకు తెలుసునని, ఉద్యోగులు విధుల్లో లేకపోవడంతో తానేమి చేయలేనని ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.దేముడు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రక్రియ జరగదని స్పష్టం చేశారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కెమికల్ విభాగాధిపతి పి.ప్రకాశరావు బయటకువచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున ప్రక్రియ జరపలేమన్నారు. పత్రికా ప్రకటన ద్వారా సమాచారం తెలియజేస్తామని, అంత వరకూ కేంద్రాల వద్దకు రావద్దని సూచించారు. ఎంసెట్ అభ్యర్థులకు ఎటువంటి నష్టం జరగనివ్వబోమని పాలా రాష్ట్ర చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ ప్రకటించారు. ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రక్రియ గడువును పెంచే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలు అందాయన్నారు.
చివరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేసినట్టు బయట బోర్డును ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులు వెనుతిరిగారు. విజయనగరం, శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని తెలిసి కొంత మంది అటు ప్రయాణమయ్యారు. అక్కడ కూడా నిలిపివేశారని తెలిసి నిరాశతో వెనుతిరిగారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లోని హెల్ప్ సెంటర్లకు వెళ్లినట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో రవాణా సదుపాయం లేకున్నా రైలు, టాక్సీల సహాయంతో అభ్యర్థులు జిల్లా నుంచి వెలుతున్నట్టు తెలిసింది. జిల్లాలో మూడో రోజు కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల తాకిడి సైతం తగ్గింది.
నర్సీపట్నంలో....
నర్సీపట్నం : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మూడో రోజూ జరగలేదు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు బుధవారం ఉదయమే స్థానిక పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు. గత రెండు రోజుల మాదిరిగానే టీచింగ్ స్టాప్, నాలుగో తరగతి సిబ్బంది కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. దీంతో మూడో రోజూ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. మూడో రోజూ ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహోదగ్రులయ్యారు.
దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు. కౌన్సెలింగ్ ఉంటుందని భావించి రవాణా సదుపాయం లేకపోయినా దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చామని ఆవేదన చెందారు. దీనిపై కౌన్సెలింగ్ కో-ఆర్డినేటర్ కిషోర్ మాట్లాడుతూ ఉద్యోగుల సహకారం లేకపోవడం వల్లే నిర్వహించలేకపోతున్నామన్నారు.
మూడో రోజూ అవే కష్టాలు
Published Thu, Aug 22 2013 2:47 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement