12 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన గద్వాల -రాయిచూర్ పట్టణాల మధ్య నూతన బ్రాడ్‌గేజ్ లైన్ ఎట్టకేలకు శనివారం ప్రారంభంకానుంది. ఈమేరకు గద్వాల- రాయిచూర్ నూతన లైన్ ప్రారంభోత్సవానికి కర్ణాటకలోని రాయిచూర్ పట్టణంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు రైల్వేమంత్రి మల్లికార్జున్ ఖర్గే ప్రారంభిస్తారు.
గద్వాల, న్యూస్‌లైన్: 12 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన గద్వాల -రాయిచూర్ పట్టణాల మధ్య నూతన బ్రాడ్‌గేజ్ లైన్ ఎట్టకేలకు శనివారం ప్రారంభంకానుంది. ఈమేరకు గద్వాల- రాయిచూర్ నూతన లైన్ ప్రారంభోత్సవానికి కర్ణాటకలోని రాయిచూర్ పట్టణంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు రైల్వేమంత్రి మల్లికార్జున్ ఖర్గే ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ప్రారంభించిన కొత్త రైలు గద్వాల రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. గద్వాలలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మందా జగన్నాథం స్వాగతం పలుకుతారు. గద్వాల రైల్వేస్టేషన్‌లో అందుకుకావాల్సిన ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. క్యాంటిన్‌లో టీ తాగి నాణ్యతపై మండిపడ్డారు. మంచినీటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ జగన్నాథం మాట్లాడుతూ..ఇక్కడి రైల్వేస్టేషన్‌లో పారిశుధ్యంతోపాటు, ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలను మెరుగు పర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
శనివారం ఈ కొత్త బ్రాడ్‌గేజ్ లైన్ ప్రారంభోత్సవానికి దక్షణ మధ్య రైల్వే డీఆర్‌ఎం రాకేష్‌యారన్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్‌కె. శర్మ, చీఫ్ ఇంజనీర్ డీకే. సింగ్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మోతిలాల్‌తోపాటు, ఉన్నతాధికారులు రానున్నారు. గద్వాల- రాయిచూర్ పట్టణాల మధ్య కొత్తలైన్ ప్రారంభం కావడంతో గద్వాల రైల్వేస్టేషన్ జంక్షన్‌గా మారుతుంది. గద్వాల-రాయిచూర్ పట్టణాల మధ్య డెమో రైలును రోజుకు మూడు షిఫ్టులుగా నడుపుతారు. రాయిచూర్ నుంచి వయా గద్వాల మీదుగా కాచిగూడ వరకు ప్రతి రోజు ప్యాసింజర్ రైలు మెమో నడుస్తుంది. ఈ రెండు రైళ్లను రాయిచూర్‌లోనే కేంద్ర రైల్వేమంత్రి ప్రారంభిస్తారు. త్వరలోనే నంద్యాల నుంచి కర్నూలు వరకు నడుస్తున్న ప్యాసింజర్ రైలును గద్వాల మీదుగా రాయిచూర్ వరకు కొనసాగించనున్నారు.
ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
గద్వాల-రాయిచూర్ కొత్త బ్రాడ్‌గేజ్ లైన్ ప్రారంభోత్సవానికి గద్వాల రైల్వేస్టేషన్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఈమేరకు రైల్వేస్టేషన్‌లో ఉన్న మూడు లైన్ల ట్రాక్‌లను శుభ్రం చేస్తున్నారు. దీంతోపాటు స్టేషన్‌లోని ప్రతి ప్లాట్‌ఫాంలో కొత్త ఫ్యాన్ల బిగింపు, ప్లాట్‌ఫాంలో ఉన్న చెట్లకు రంగులు వేయడం, ప్లాట్‌ఫాం వెంట పరిశుభ్రత పనులు, వేచి ఉండే గదులను శుభ్రం చేయడం ఇలా రైల్వేస్టేషన్‌ను ముస్తాబు చేస్తున్నారు.