విషాదం మిగిల్చిన విహార యాత్ర
కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మిత్రులు
పెనుకొండ: విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. పట్టణంలోని పెనుకొండ కొండపై పర్యాటక అందాలను తిలకించాలని వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో ప్రమాదవశాత్తు ఇద్దరు కోనేరులో పడి మృతి చెందారు. మరొకరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కొండపైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలోని కోనేరులో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. హిందూపురం సమీపంలోని సంతేబిదనూరుకు చెందిన మహబూబ్ బాషా (26) వృత్తిరీత్యా బెంగళూరులో బేకరిలో పని చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. హిందూపురం పట్టణానికి చెందిన యూసుఫ్ (19) పట్టణంలో ద్రాక్ష వ్యాపారం చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అదే పట్టణానికి చెందిన ఖలీద్ చిల్లర వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
పర్యాటక అందాలను చూడడానికి వెళ్లి..
గురువారం మధ్యాహ్నం వారు పెనుకొండ కొండపైన పర్యాటక అందాలు చూడడానికి ఒకే ద్విచక్ర వాహనంలో వెళ్లారు. కొండపై కోనేరు వద్దకు వచ్చి ముఖాలు కడుక్కుంటూ నీటిలో చేపలు ఉన్నాయేమోనని ముందుకు వంగగా పాచి కారణంతో మహబూబ్ బాషా నీటిలోకి జారిపోయాడు. బాషాను పట్టుకోబోయిన ఖలీద్ సైతం నీటిలోకి జారిపోయాడు. వీరిని రక్షించడానికి ప్రయత్నించిన యూసుఫ్ సైతం నీటిలోకి జారిపోయాడు. ఖలీద్‌కు చెట్టు వేరు దొరకడంతో బయటకు చేరుకున్నాడు.
మిగిలిన ఇద్దరు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందారు. అక్కడున్న ఇతర ప్రాంతాల వ్యక్తులు వీరిని రక్షించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఖలీద్ ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ లింగన్న, అగ్నిమాపక అధికారి ఆంజనేయులు సిబ్బందితో వెళ్లి కోనేరులో మృతదేహాలను వెలికితీశారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పెనుకొండకు చేరుకుని మృత దేహాలను చూసి బోరున విలపించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఈతకు వెళ్లి మరొకరు..
ధర్మవరం అర్బన్ : పట్టణంలోని సూర్యప్రతాప్‌రెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ప్రతాప్(34) స్విమ్మింగ్‌పూల్‌కు ఈతకెళ్లి మృతి చెందాడు. అతడికి భార్య లక్ష్మి, కుమారులు ఉదయ్‌కిరణ్, జస్వంత్ ఉన్నారు. గురువారం కుమారులిద్దరినీ తీసుకుని ఈతకెళ్లాడు. అతడికి ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.