సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో కాంగ్రెస్ కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇరువురు రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా పార్టీ జెండాతో జనంలోకి వెళ్లే పరిస్థితి కరువైంది.
కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రమైన కర్నూలులో రాష్ట్ర చిన్ననీటి పారుదలాశాఖ మంత్రి టీజీ వెంకటేష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపడం జిల్లా పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేబినెట్ తీర్మానం చేసిన రోజే కర్నూలులో సమైక్యవాదులు పెద్ద ఎత్తున మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన హోటల్ మౌర్యఇన్‌పై దాడికి యత్నించడం తెలిసిందే. ఉద్యమకారులపై అక్రమంగా కేసులు బనాయించారనే అపవాదూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జెండాతో ఎన్నికలకు వెళితే ఘోర పరాభవం తప్పదనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్యతో పాటు మరికొందరు నాయకులు సైతం కాంగ్రెస్ పేరు చెప్పుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి మాత్రం పదవికి రాజీనామా చేసినా.. పార్టీకి విధేయుడుగానే ఉండటం గమనార్హం. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి విషయానికొస్తే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా పార్టీ తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోరనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
పోటీ అనుమానమే...
నంద్యాల డివిజన్‌లో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైనట్లే కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం తెలిసిందే. డివిజన్‌లో మంచి పట్టున్న భూమా నాగిరెడ్డి, ఎస్పీవెరైడ్డి ఒక్కటవ్వడంతో నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్నిస్తోంది.
ఇకపోతే నంద్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే శిల్పా మోహనరెడ్డి రాష్ట్ర విభజన నేపథ్యంలో పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లోనూ స్వతంత్రగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించి నియోజకవర్గంలో పార్టీ జెండా లేకుండా పర్యటిస్తున్నారు. ఈయన కూడా సొంత ఇమేజ్ తోనే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కోడుమూరు విషయానికొస్తేప్రస్తుత ఎమ్మెల్యే మురళీకృష్ణకు ప్రజలతో సత్సంబంధాలు లేవనే భావన పార్టీలో ఉన్నట్లు సమాచారం.
దీంతో రానున్న ఎన్నికల్లో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆకెపోగు వెంకటస్వామిని బరిలోకి దింపాలని కేంద్ర మంత్రి కోట్ల భావిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతోంది. ఆలూరులో ఎమ్మెల్యే నీరజారెడ్డి రెండు నెలలకు పైగా ఉద్యమం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ దృష్ట్యా ఆమె ఆలూరు నుంచి బరిలో నిలవడం అనుమానమేనని తెలుస్తోంది. పత్తికొండ నుంచి చెరుకులపాడు నారాయణరెడ్డి బరిలో నిల్చొనే అవకాశం ఉన్నా.. ఫ్యాక్షనిస్టు ముద్ర నేపథ్యంలో ఆయనను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది చర్చనీయాంశమవుతోంది.
స్వతంత్రమా.. సన్యాసమా!
Published Sun, Oct 20 2013 4:25 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement