నిదురపోరా తమ్ముడా..
► మారుతున్న నిద్ర వేళలు
► అర్ధరాత్రి వరకూ మేల్కొనే ఉంటున్న యువత
► ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు
సూర్యోదయానికి గంటన్నర ముందు సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కచ్చితంగా చెప్పాలంటే.. ఒక గంటా 36 నిమిషాలు.. అంటే 96 నిమిషాలకు ముందు సమయం. ఈ సమయంలో మెలకువ వచ్చిందంటే.. ఆ వ్యక్తి ఆరోగ్యానికి దగ్గరగా ఉన్నట్టే. ఆ సమయంలో శక్తివంతమైన ఎలక్ట్రో మేగ్నటిక్, ఆధ్యాత్మిక వలయాలు వాయువ్య దిశలో పయనిస్తుంటాయని, వాటికి వ్యతిరేక దిశలో కూర్చుని యోగాలాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని యోగులు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ సమయంలో నిద్ర లేచేవారు మనలో ఎంతమందున్నారో ఆలోచించండి.
ఫోన్‌తో చేటు
ఉద్యోగ ఒత్తిడి, వ్యాపారం నిర్వహణ కష్టాలు, ఆర్థిక సమస్యలు, చదువులో విపరీతమైన పోటీ వల్ల సాధారణంగా నిద్రలేమి సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం యువతరాన్ని బానిసలుగా మార్చేస్తున్న అతి పెద్ద సమస్య అంతర్జాల వినియోగం, స్మార్ట్ ఫోన్ ఫీవర్. వీటి కోసం నిద్రను మానుకుని ఫోన్‌తోనే అర్ధరాత్రి వరకూ గడిపేస్తున్నారు. నిద్రపోయే సమయాన్ని అలా.. అలా... రాత్రి 10.. 11... 12.. ఒంటి గంట ఇలా పెంచుకుంటూ పోతున్నారు.
నిద్రలేమితో త్వరగా మరణం
ఎయిమ్స్ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం.. ఢిల్లీలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో యువత సైతం ఎక్కువగానే ఉన్నారు. రోజుకు 7 గంటలు నిద్రపోయిన వారిలో మరణశాతం రేటు తక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అలాగే 6 గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ పడుకున్నా.. 15 శాతం మరణరేటు పెరుగుతోందని గుర్తించారు.
నిద్రమేల్కొంటే..?
► నిద్రను ఆపుకుని మరీ ఐఫోన్లలో రాత్రంతా గడిపే యువత మరుసటి రోజు మందకొడిగా మారిపోతారు. వారు సరిగ్గా గంట నిలబడలేరు.. కూర్చోలేరు.. తరగతి గదిలో ఓ గంట పాఠం వినడమే గగనమే.
► తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. జ్ఙాపకశక్తి తగ్గిపోతుంది. వీరికి తలనొప్పి, ఒంటినొప్పులు నిత్యకృత్యం. వీటిని తగ్గించుకునేందుకు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటారు. ఇది కడుపులో మంటకు దారితీస్తుంది. దానిని తగ్గించుకునేందుకు ఏదైనా తినేస్తుంటారు. ఇది ఒబిసిటికి దారి తీస్తుంది.
► ప్రధానంగా నిద్రలేమి వల్ల శరీర కాలచక్రం గతి తప్పుతుంది. దీనివల్ల ఏ సమయానికి చేయాల్సిన పనులు.. ఆ వేళకు జరగవు. ఏకాగ్రత లోపిస్తుంది. కళ్లు ఎర్రబడతాయి. కళ్లు లోపలికి పోయి.. దురదలు వస్తాయి. నీరు కారుతుంటాయి. నిద్రలేమి వల్ల వినికిడి శక్తి సైతం తగ్గిపోతుంది. ఉత్సాహం తగ్గిపోతుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. సరైన సమయానికి మలమూత్ర విసర్జన సైతం జరగదు. అందుకే నిద్ర అన్నింటికీ ప్రధానమని గుర్తించాలి.
శారీరక చక్రానికి నిద్రే ప్రధానం
నిద్రతోనే విశ్రాంతి దొరుకుతుంది. బాగా నిద్రపోతేనే శరీరంలోని గ్లూకోజ్‌ను అన్ని కణాలూ సమానంగా తీసుకుంటాయి. అప్పుడే శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. – డాక్టర్ నరసింహులు, కంటి వైద్య నిపుణులు, ధర్మవరం