- ఇసుక అమ్మకాల్లో డ్వాక్రా మహిళలకు రూపాయికి 3 పైసలిస్తున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఇసుక అమ్మకాలను పూర్తిగా డ్వాక్రా సంఘాలకు అప్పగించామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు.. దాని ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రం వారికి తగిన వాటా ఇవ్వడంలేదు. డ్వాక్రా సంఘాలకు రూపాయికి కేవలం 3 పైసలే చెల్లిస్తోంది. రోజు మొత్తం రీచ్‌ల వద్ద తిండితిప్పలు లేకుండా పనిచేస్తున్న మహిళలకు కష్టం మాత్రమే మిగులుతుంటే.. వచ్చే ఆదాయం మాత్రం ప్రభుత్వ ఖజానాను నింపుతోంది.
ఇసుక వినియోగదారుల నుంచి మీ సేవ లేకబ్యాంకుల ద్వారా ప్రభుత్వమే డబ్బు వసూలు చేసుకుంటోంది. మహిళలను మాత్రం ఇసుక తవ్వకాలు, డబ్బులు చెల్లించిన వారికి రీచ్‌లో ఇసుకను ఎత్తే బాధ్యతలకే పరిమితం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 28న కొత్త ఇసుక విధానం అమలులోకి తీసుకొచ్చిన తరువాత నుంచి ఈ ఏడాది జనవరి 27వ తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు 25 లక్షల క్యూబిక్ మీటర్ల అమ్మకాలు జరిగాయి.త ద్వారా రూ. 157 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
ప్రస్తుతం 210 రీచ్‌ల్లో అమ్మకాలుసాగుతుండగా, నిర్వహణ బాధ్యతలను 210 మ్యాక్స్ సొసైటీలకు అప్పగించారు. వీటిలో 15 వేల వరకు డ్వాక్రా సంఘాలు, 600 గ్రామ సమాఖ్యలున్నాయి. రూ. 157 కోట్ల లో డ్వాక్రా మహిళలకు జీతాల రూపేణా రూ. 3.89 కోట్లు, సొసైటీల్లో ఉన్న మొత్తం 15 వేల సంఘాలకు ప్రోత్సహకంగా మరో రూ. 1.24 కోట్లను మాత్రమే కేటాయింపులు చేశారు. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన సీనరేజీ, ఇతర ఖర్చులు పోను రూ. 96.12 కోట్లు ప్రభుత్వానికి మిగిలిపోయాయి.