♦ డ్వాక్రా మహిళలపై వైఫల్యం ముద్ర
♦ ఇసుక రీచ్‌లు ప్రైవేటు కాంట్రాక్టర్లకు
♦ అప్పగించాలని నిర్ణయించిన కేబినెట్
♦ జోగయ్య రచన పార్టీకి నష్టమేనన్న మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అందిన కాడికి దోపిడీ చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న ఇసుక రీచ్‌ల వ్యవహారం మలుపు తిరగబోతోంది. అంతా అనుమానించినట్టుగానే ఇసుక రీచ్‌ల నిర్వహణలో డ్వాక్రా మహిళలు విఫలమయ్యారనే పేరిట పాత విధానంలో కాంట్రాక్టర్లకు రీచ్‌లను అప్పగించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఒక్కసారిగా వ్యవహారం బయటపడకుండా ప్రస్తుతానికి అక్రమాల నియంత్రణ పేరుతో ఒక ఐఏఎస్ లేదా ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించి తదుపరి క్రమంలో ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించే ప్రణాళికను ఖరారు చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక అమ్మకాలు, అక్రమ రవాణా, ప్రజల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలపై చర్చ జరిగింది. ఇసుక దందాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని కొందరు మంత్రులు చెప్పారు. ఇప్పటికే ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఈ సందర్భంగా అందుకు పథక రచన చేసినట్టు కొందరు మంత్రుల సమాచారం. ఇసుక అమ్మకాలను వేలం పాట ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిద్దామనే సూచనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే ఇప్పటికిపుడు డ్వాక్రా సంఘాలను తప్పిస్తే వారి నుంచి వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అమ్మకాల పర్యవేక్షణతో పాటు అక్రమాలను అరికట్టే పేరిట సివిల్ సర్వీస్ అధికారులను నియమించి.. వారితో తామనుకున్నట్టుగా నివేదిక ఇప్పించడం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
జోగయ్య పుస్తకంపై చర్చ
మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన స్వీయ చర్రిత పుస్తకంలో కాంగ్రెస్ నేత వంగవీటి మోహనరంగా హత్యోదంతానికి సంబంధించి ప్రస్తావించిన అంశాలు కేబినెట్‌లో చర్చకు వచ్చాయి. జోగయ్య లేవనెత్తిన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించగా, నష్ట నివారణ చర్యలపై మంత్రివర్గం చర్చించినట్టు సమాచారం. తాజా పరిణామాలు పార్టీకి నష్టం కలిగించేవిగా ఉన్నాయని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి కొన్ని వరాలు ప్రకటించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇసుక దోపిడీకి కొత్త పథకం!
Published Tue, Nov 3 2015 4:23 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement