కోరుట్ల, న్యూస్‌లైన్ : చంద్రయ్య హత్యోదంతంలో రాజకీయ కుట్ర దాగి ఉందని, దీని కారణంగానే పోలీసులు అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పౌరహక్కుల సంఘం ప్రతినిధులు ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం ఏపీసీఎల్‌సీ నాయకులు చంద్ర య్య మృతి చెందిన కోరుట్ల పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఇన్‌చార్జి డీఎస్పీ దామెర నర్సయ్యను కలిసి చంద్రయ్య మృతి వివరాలు తెలుసుకున్నారు. ఇంటరాగేషన్ చేసిన గదితోపాటు ఠాణా రెండవ అంతస్తు పైకి ఎక్కి పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తమ పరిశీలన ప్రకారం.. ధర్మపురి, కోరుట్ల పోలీసులు కలిసి చంద్రయ్యపై చంద్రయ్యపై థర్డ్‌డిగ్రీ ప్రయోగిస్తూ రెండు రోజులుగా ఇంటరాగేషన్ చేశారన్నారు. ఈ దెబ్బలకు చనిపోయిన చంద్రయ్యను ఠాణాలో ఓ పక్కన కింద పడేసి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ చెబుతున్నారని ఆరోపించారు. చంద్రయ్య ఆత్మహత్య చేసుకుంటే సంఘటన స్థలంలో పంచనామా రికార్డు చేయాల్సి ఉండగా అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
సంఘటన జరిగిన వెంటనే కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతోనే పోలీసుల తప్పిదం తెలుస్తోందన్నారు. పోలీసు రికార్డుల్లో కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి వివరాలు నమోదు చేయాల్సి ఉండగా ఆ రికార్డు అడిగితే పోలీసులు దాటవేయడం.. వాళ్లే చంద్రయ్యను చంపారన్న అనుమానాలకు బలాన్నిస్తోందన్నారు. చంద్రయ్య మృతి సంఘటనపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జీఈవీ.ప్రసాద్, ప్రధానకార్యదర్శి మాదం కుమార్, కోశాధికారి మహ్మద్ అక్బర్, కార్యవర్గసభ్యులు శ్రీపతి రాజగోపాల్ ఉన్నారు.
రాజకీయ కుట్ర ఉంది
Published Wed, Jan 22 2014 3:43 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement