‘రెండు నెలలుగా పట్టించుకోక పోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అపరిశుభ్రత నెలకొంది. అదంతా శుభ్రం చేశాక వెళదాంలే అని కొందరు.. తొలి రోజే కదా.. పనిచేయకపోతే మించిపోయిందేమీ లేదు.. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేస్తే చాలని మరికొందరు.. సమైక్య ఉద్యమ తీరుతెన్నుల కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఇంకొందరు.. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే సమ్మె బాట వీడి విధుల్లో చేరిన ఉద్యోగులు తొలి రోజు శుక్రవారం బద్ధకంగా గడపడం న్యూస్‌లైన్ విజిట్‌లో కనిపించింది.
సాక్షి, అనంతపురం : తెలుగు జాతి విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు అలుపెరుగని పోరు సాగించిన ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు సుదీర్ఘ సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించి శుక్రవారం విధుల్లో చేరారు. తొలి రోజంతా విధి నిర్వహణ కన్నా శుభ్రతకే ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రభుత్వ ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లూ కార్యాలయాలు తెరుచుకోకపోవడంతో పరిపాలన స్తంభించిపోయింది. ప్రధానంగా రెవెన్యూ, మునిసిపల్, సబ్‌ట్రెజరీ, సబ్ రిజిస్ట్రార్ తదితర కార్యాలయాలు మూతపడడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే గురువారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె ముగించి విధుల్లో చేరనున్నట్లు ఆయా సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నా..అధికారులు, ఉద్యోగుల్లో మాత్రం పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. సమ్మె ముగిసినా సమైక్య ఉద్యమ లక్ష్యం మాత్రం నెరవేరలేదనే నైరాశ్యం వారిలో కనిపించింది. మొదటి రోజే పలు చోట్ల అధికారులు, సిబ్బంది విధులకు ఆలస్యంగా హాజరయ్యారు. ఇన్నాళ్లూ కార్యాలయాలకు తాళాలు వేయడంతో అవి దుమ్మూ..ధూళితో నిండిపోయాయి. కొన్ని కార్యాలయాల్లో బూజు పట్టి.. పాడుపడిన వాటిల్లా తయారు కావడంతో..విధులకు హాజరైన ఉద్యోగులు తొలి రోజంతా కార్యాలయాలు, కుర్చీలకు పట్టిన దుమ్మును దులుపుకోవడం, తుడుచుకోవడానికే పరిమితమయ్యారు. మొక్కు బడిగానే విధుల్లో పాల్గొన్నారు.
కాగా కొన్ని మండలాల్లో వ్యవసాయశాఖ, ఉద్యానవనం, తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు తెరుచుకోలేదు. సమ్మె అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు విధులకు హాజరౌతున్న నే పథ్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ ‘న్యూస్‌లైన్ విజిట్’ నిర్వహించింది. ఉద్యోగులు, అధికారులు విధులకు ఆలస్యంగా హాజరుకావడం, మరికొంత మంది అధికారులు జిల్లా కేంద్రాలకే పరిమితం కావడం వెలుగు చూసింది.
నింపాదిగా..
Published Sat, Oct 19 2013 2:45 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement