సవరణలపై చట్టసభల్లో చర్చ జరగడం లేదు
జస్టిస్ నూతలపాటి వెంకటరమణ
సాక్షి, అమరావతి: ఆర్థిక, విద్యుత్ సంస్కరణలు పేదల జీవన ప్రమాణాలు పెంచేవిగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. సమాజానికి అవసరమైన చట్టసవరణలపై చట్టసభల్లో సమగ్ర చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) కొత్త నిబంధనావళిని రూపొందించింది. ఈ రెగ్యులేషన్‌ను విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ రమణ సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదాల్లో బాధితులకు హేతుబద్ధమైన పరిహారం మానవ ధర్మమన్నారు. ఏ సంస్కరణలైనా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని, అయితే చట్టసవరణలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాలను గుర్తించి, వారి అభిమతం, ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలని అభిప్రాయపడ్డారు.
కనీస ధర్మం: జస్టిస్ భవానీ ప్రసాద్
విద్యుత్ ప్రమాదాల రూపేణా అసువులు బాసిన అనేక సంఘటనలు తనను కలిచివేశాయని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి చట్టపరిధి ఇబ్బందిగా ఉండేదని ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ అన్నారు.