నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: ‘గంటల తరబడి కార్యాలయాల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేదు. నిమిషాల వ్యవధిలో మీ బిల్లులు చెల్లించి ఎంచక్కగా మీ పనులు చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌లో సేవలు ఉపయోగించుకున్నందుకు కేవలం రూ.10 చెల్లిస్తే చాలు’ అనే ప్రకటనలతో నెల్లూరు నగరంలో రోజుకొకటి చొప్పున ఆవిర్భవిస్తున్న ఇంటర్నెట్ కేంద్రాలు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నాయి.
ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యుత్ బిల్లులు వసూలు చేయడమే గాకుండా ఆ సొమ్మును సొంతానికి నొక్కేస్తున్న ఓ ఇంటర్నెట్ కేంద్రం నిర్వాహకుడి వ్యవహారం సోమవారం వెలుగు చూసింది. కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో కనెక్షన్ తొలగిస్తామని యజమాని దగ్గరికి విద్యుత్ సిబ్బంది వెళ్లడంతో మోసం వెలుగు చూసింది. ఇంటర్నెట్ కేంద్రంలో తాను బిల్లు చెల్లించానని రశీదు చూపడంతో విస్తుపోయిన విద్యుత్ అధికారులు ఆ కేంద్రానికి పరుగులు తీశారు.
వెలుగు చూసిందిలా..
కలెక్టర్ కార్యాలయంలో ఎస్‌బీఐ ఏటీఎం ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లో మాధవి మొబైల్స్ పేరుతో ఇంటర్నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి బిల్స్ ఎన్ టికెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నెట్ సెంటర్‌ను ప్రారంభించారు. తమ కేంద్రంలో ఎలాంటి బిల్లులైనా చెల్లించవచ్చని ప్రకటనలు గుప్పించారు.
దీంతో మాధవి మొబైల్స్ యజమాని ఆ వ్యక్తికి కొంత మొత్తాన్ని చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుని ఆ కేంద్రం ద్వారా అన్ని శాఖల బిల్లుల చెల్లింపులకు సంబంధించి లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నబజార్‌కు చెందిన వ్యాపారి కరెంట్ బిల్లును మాధవి మొబైల్స్ ఇంటర్నెట్ కేంద్రంలో చెల్లించారు. దీనికి సంబంధించి ఇంటర్నెట్ కేంద్రం నుంచి రశీదు కూడా పొందారు. బిల్లు చెల్లించాం కదా తమకేంటి అనే ధీమాతో యజమాని ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు ఇంకా చెల్లించలేదని, కనెక్షన్‌ను తొలగించేందుకు యజ మాని ఇంటికి విద్యుత్ సిబ్బంది వెళ్లారు.
దీంతో యజ మాని బిల్లు చెల్లించిన రశీదును సిబ్బందికి చూపించడంతో విస్తుపోయారు. విద్యుత్ బిల్లులు ఈసేవ, మీసేవ, విద్యుత్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించడానికి అనుమతి ఉంది. ఇంటర్నెట్ కేంద్రం విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్న విషయాన్ని సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెవెన్యూ విభాగం ఏఓ అజయ్ ఆధ్వర్యంలో అధికారులు బిల్లులు కట్టించుకున్న ఇంటర్నెట్ కేంద్రం దగ్గరకు వెళ్లి ఆరా తీశారు. ఇదే కోవలో దాదాపు 20 మంది వినియోగదారులు అదే ఇంటర్నెట్ కేంద్రంలో బిల్లులు చెల్లించారు. ఆ మొత్తం విద్యుత్‌శాఖకు జమ కాలేదు. ఈ విషయంపై ఆరా తీయడంతో విద్యుత్ వినియోగదారుల నుంచి రూ. 7,000 కట్టించుకున్నట్లు ఇంటర్నెట్ నిర్వాహకుడు అధికారులకు తెలిపారు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, వెంటనే ఆ మొత్తాన్ని చెల్లిస్తానని నిర్వాహకుడు ఒప్పుకున్నాడు. ఆగమేఘాలపై వెళ్లి ఆదివారం ఆ మొత్తాన్ని విద్యుత్ అధికారులకు చెల్లించారు. ఇంకా ఎక్కువ మొత్తంలో వినియోగదారులు బిల్లులు చెల్లించి ఉంటారని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం నాయుడుపేటలో ఏపీఆర్ వరల్డ్ అనే పేరుతో వెలిసిన ఇంటర్నెట్ కేంద్రం కూడా ఇదే రీతిలో విద్యుత్ బిల్లులును వసూలు చేశారు. పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేసి ఇంటర్నెట్ కేంద్రాన్ని మూసివేశారు.అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇంటర్నెట్ కేంద్రాల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
బయట చెల్లిస్తే మాకు సంబంధం లేదు
విద్యుత్ బిల్లులు ఈసేవ, మీసేవ, విద్యుత్ బిల్లుల కేంద్రాల్లో మాత్రమే వినియోగదారులు చెల్లించాలి. ఇవి గాక మరెక్కడైనా చెల్లిస్తే మాకు సంబంధం లేదు. అనుమతి లేకుండా బిల్లులు కట్టించుకుంటే చర్యలు తీసుకుంటాం.
-నందకుమార్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
మోసం గురూ..
Published Tue, Oct 1 2013 4:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement