పండగ రోజు ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. అల్లారు ముద్దుగా ఉండే చిన్నారులు మృతి ఒడికి చేరుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బుధవారం రోడ్డు ప్రమాదంలో ఒకరు, మంగళవారం నీళ్ల బకెట్‌లో పడి మరో చిన్నారి
మృతి చెందారు.
కల్లూరు, న్యూస్‌లైన్: పెద్దటేకూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కురువ చిన్న (6) అనే బాలుడు దుర్మరణం చెందాడు. గ్రామానికి చెందిన కురువ కోటేశ్వరరావు, కురువ జయలక్ష్మీ దంపతులకు సతీష్, చిన్న అనే ఇద్దరు కుమారులు. పండగ సందర్భంగా ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులతో సరదాగా గడిపారు. సాయంత్రం చిన్న ఇంటి నుంచి రోడ్డు అవతలకు అన్న సతీష్‌తో కలిసి వెళ్తున్నాడు. సతీష్ రోడ్డు దాటి ముందుగానే వెళ్లాడు.
వెనుక వస్తున్న చిన్నను డోన్‌వైపు వేగంగా వెళ్తున్న కేఏ 35 ఎన్ 777 నంబరు కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన చిన్న అక్కడిక్కడే మృతిచెందాడు. వెంటనే తల్లిదండ్రులు, బంధు మిత్రులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించారు. ఢీ కొట్టిన కారు కోసం వెల్దుర్తి టోల్ గేటు దాకా వెళ్లి గాలించినా ఆచూకీ దొరకలేదు. బాలుడిని పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉలిందకొండ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘చిన్న’ నేత్ర దానం: మరణించిన కురువ చిన్న తల్లిదండ్రులతో కర్నూలు డీఎస్‌పీ రమణ కుమార్ చొరవతో సీఐ శ్రీనివాస మూర్తి మాట్లాడి నేత్ర దానం చేసేందుకు వారిని ఒప్పించారు. ఈ మేరకు ఉలిందకొండ ఎస్‌ఐ నరేంద్ర కుమార్ న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ కురువ చిన్న కళ్లను దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించి నిబంధనల మేరకు సంతకాలు చేశారని తెలిపారు. ఇది జిల్లాలో మొట్టమొదటి సంఘటనగా ఆయన పేర్కొన్నారు. కళ్లను రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేయనున్నామని ఎస్‌ఐ చెప్పారు.
నీళ్ల బకెట్‌లోపడి చిన్నారి మృతి
నందవరం, న్యూస్‌లైన్: సంక్రాంతి పండగనాడే ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిని మృత్యువు మింగేసింది. కన్న తల్లికి శోకం మిగిల్చింది. మండల పరిధిలోని కె.పేట గ్రామంలో మంగళవారం నీళ్ల బకెట్‌లో పడి ఓ చిన్నారి మృతి చెందింది. రామప్ప, జయమ్మ అనే దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఉదయం రామప్ప ఇంటి ఎదుట సొంత ఆటోను శుభ్రం చేస్తుండగా పిల్లలు పక్కనే ఆడుకుంటున్నారు. ఇంట్లో మూడో కుమార్తె భారతి(1)తో తల్లి జయమ్మ పనులు చేస్తోంది. ఈ క్రమంలో చిన్నారిని ఒంటరిగా వదిలి ఆమె పని మీద బయటకు వచ్చింది. ఆ సమయంలో చిన్నారి ఆడుకుంటూ వచ్చి పక్కనే ఉన్న బకెట్‌లో నీటిని చూస్తూ తలకిందులై పడి పోయింది. కొద్దిసేపటికి ఇంట్లోకి వచ్చిన జయమ్మకు కుమార్తె కనిపించక పోవడంతో ఆందోళన చెంది బకెట్‌లో చూడగా అప్పటికే మృతి చెందింది. కుమార్తె మృతితో తల్లిదండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది.
పండుగనాడు పరలోకాలకు
Published Thu, Jan 16 2014 4:44 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement
Advertisement