గుంతకల్లు రూరల్: ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ప్రతి పనినీ కలిసే చేసేవారు.. ఎక్కడికై నా కలిసే వెళ్లేవారు. చివరికి మృత్యువులోనూ వారు స్నేహం వీడలేదు. వివరాలు... గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఉరుకుందప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వీరన్న (26), అదే గ్రామానికి చెందిన రాము, మహాలక్ష్మి దంపతుల కుమారుడు రవీంద్ర (25) ఇటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరన్నకు కృపాకుమారితో వివాహం కాగా, 6, 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు బిడ్డలున్నారు. ఆరు నెలల క్రితం లక్ష్మి అనే యువతితో రవీంద్రకు వివాహమైంది.
వీరన్న, రవీంద్ర ఒకే గ్రామానికి చెందిన వారే అయినా.. ఆటోడ్రైవింగ్ ద్వారానే ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. కొంత కాలం క్రితం ఇద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల అనంతరం గుండె సంబంధిత వ్యాధితో వీరన్న, షుగర్, బీపీతో రవీంద్ర బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. పది రోజుల క్రితం ఆయాసం ఎక్కువ కావడంతో వీరన్నను కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు.
రవీంద్ర ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మంగళవారం తెల్లవారుజాము 5 గంటలకు రవీంద్ర, 5.30 గంటలకు వీరన్న మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులు గ్రామానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment