ఆ అంశాలకు పరిష్కారం దొరకదు: అశోక్‌బాబు
సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాట్లాడకుండా ఉంటే మంచిదని హితవు
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరిన 11 అంశాలకు అసలు పరిష్కారమే దొరకదని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు చెప్పారు. ఆ అంశాలను పరిష్కరించడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, ఏదో ఒక ప్రాంతానికి అన్యాయం చేయక తప్పదని అన్నారు. ఏపీఎన్జీవో ప్రతినిధులు గురువారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని సచివాలయంలో కలిశారు. ఉద్యోగుల హెల్త్‌కార్డులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. జీవోఎం పేర్కొన్న అంశాల పరిష్కారం, పర్యవసానాలపై చర్చించేందుకు 16న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9 లేదా 10న ఢిల్లీలో జాతీయ నాయకులను కలుస్తామని చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్‌మెంట్ కూడా కోరామని తెలిపారు. సీమాంధ్రకు ప్యాకేజీలివ్వాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కోరడం సబబుగా లేదని, వారు మాట్లాకుండా ఉంటే మంచిదని అన్నారు.
హెల్త్‌కార్డులపై సమావేశం ఏర్పాటు చేయాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జారీ చేసిన హెల్త్‌కార్డులపై కొన్ని అభ్యంతరాలున్నాయని చెప్పారు. వీటి పరిష్కారానికి వెంటనే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 30 ధీర్ఘకాలిక వ్యాధులకు అన్ని ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ సదుపాయాలు ఉచితంగా కల్పించేందుకు ప్రభుత్వం గతంలో అంగీకరించిందని, హెల్త్‌కార్డుల జీవోలో మాత్రం దానిని పొందుపరచలేదని తెలిపారు. ఉద్యోగుల్లో ఏ తరగతుల వారికి ఎలాంటి చికిత్స విధానాలున్నాయనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేయాలని, అందులో ఉద్యోగులకే ప్రథమ ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులకు రెండు నెలల వేతనాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని డిమాండ్ చేశారు.