పింఛన్ పంపిణీలో తొక్కిసలాట
ప్రొద్దుటూరు టౌన్: ఎంతగానో పింఛన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఒకరినొకరు తోసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురై రోధించిన సంఘటన సోమవారం గోపవరం పంచాయతీ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఒక్క మిషన్ పెట్టుకుని 1600 మందికి ఒకేచోట పింఛన్ ఇవ్వడం సాధ్యమా.. కాదని సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మూడు ప్రాంతాల్లో పింఛన్ పంపిణీని చేపట్టాలని ఆయన సూచించారు. తొక్కిసలాటలో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ‘మా ప్రాణాలు పోతున్నాయ్.. మా గోడు కొట్టుకుంటుంది’ అంటూ వృద్ధులు, వికలాంగు లు అధికారులను శపించారు.
ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పరిధిలో ఉన్న యానాది కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, లింగారెడ్డినగర్, శ్రీనివాసపురం, ద్వారకానగర్, ఆచార్యుల కాలనీ, హౌసింగ్ బోర్డు, ఇందిరానగర్, రాజీవ్‌నగర్‌లలోని 1600 మంది పింఛన్ లబ్దిదారులకు హౌసింగ్ బోర్డులోని గోపవరం పంచాయతీ కార్యాయలంలో పింఛన్ పంపిణీ చేపట్టారు. ఇచ్చే నాలుగు రోజుల్లోనే లబ్ధిదారులు అష్టకష్టాలు పడి పింఛన్ తీసుకెళ్లాలి. అలా కాకపోతే పింఛన్ ఇవ్వరు. ఇలా వందల మంది లబ్ధిదారులకు మూడు నెలలుగా పింఛన్ ఇవ్వలేదు. కొందరి పేర్లు ఆటోమేటిక్‌గా తొలగించారు. యానాదకాలనీ నుంచి వృద్ధులు, వికలాంగులు పింఛన్ పంపిణీ కేంద్రానికి రావాలంటే దాదాపు 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ కాలనీకి దగ్గరలో ఉన్న కాల్వకట్ట, లింగారెడ్డి నగర్‌లతో కలిపి 500 మందికి పైగా ఫించ న్ లబ్ధిదారులున్నారు.
తొక్కిసలాటతో అస్వస్థత : మూడు, నాలుగు నెలల నుంచి పింఛన్ అందక పోవడంతో వృద్ధులు, వికలాంగులు ఒక్కసారిగా కార్యాలయానికి వచ్చారు. పింఛన్ తీసుకోకపోతే తమ పేర్లను తొలగిస్తారనే భయం, ఆత్రుతతో వారు ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. డీఆర్‌డీఏ అధికారులు నియమించిన పింఛన్ పంపిణీ చేస్తున్న సీఎస్‌వీ లక్ష్మిదేవి, సిబ్బంది ఎవ రూ కూడా లబ్ధిదారులను పట్టించుకోలేదు. ఊపిరాడక కొందరు వృద్ధులు, వికలాంగులు రోధిస్తూ బయటకు వచ్చారు. లోపల కూర్చున్న లబ్ధిదారులను పింఛన్ పంపిణీ చేస్తున్న సీఎస్‌వీ వృద్ధులు, వికలాంగులని కూడా చూడకుండా ఈడ్చిపడేసింది.
ఇష్టాను సారంగా తిడుతూ ‘మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోపొండి, నేను ఇలాగే తిడతా’ అంటూ లోపలి నుంచి గెంటివేసినంత పని చేసింది. ఈ విషయంపై అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శికి లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. పింఛన్ పంపిణీ చేస్తున్న లక్ష్మిదేవి మామను కార్యదర్శి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మందికి ఒక్క మిషన్ పెట్టుకుని ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. తమకు మూడు, నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వలేదని, తమ పేర్లు లేవని చెబుతున్నారని వృద్ధులు, వికలాంగులు కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి కూడా తన నిస్సహాయతను ప్రదర్శించారు. ఈ విషయాన్ని పింఛన్ పంపిణీ కో-ఆర్డినేటర్ రఘు దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.