‘థర్మల్’ జీవో రద్దుకు హామీ
Published Tue, Dec 31 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
కంచిలి/కవిటి, న్యూస్‌లైన్: సోంపేట మండలం బీల ప్రాంతంలో తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ జీవో 1107ను రద్దు చేయిస్తామని కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి హామీ ఇచ్చారు. ఆమె సోమవారం సాయంత్రం కంచిలిలో గల మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాలా నివాసంలో తనను కలిసిన సోంపేట పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధులతో చర్చించారు. థర్మల్ ప్లాంట్ రద్దుకు సీఎం సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఉదయం కవిటి మండలంలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాజీవ్ ఇందిరా నగర్ కాలనీకి చెంది తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. కవిటిలో శాఖాగ్రంథాలయం ప్రారంభించారు. మేస్త్రీల సంఘం, మత్స్యకార ఐక్యవేదిక సంఘం, ఆటో యూనియన్ సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభివృద్ధి పనులను వివరించారు. సోంపేట బీలలో 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణానికి అవసరమైన నిధులకు ప్రతిపాదనలు రూపొందుతున్నాయన్నారు. ట్రైమెక్స్ పరిశ్రమ వల్ల మత్స్యకారులకు ఎటువంటి నష్టమూ జరగదని మత్స్యకార నాయకుడు మడ్డు రాజారావు అడిగిక ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎంపీల్యాడ్స్ కేటాయింపులో వివక్ష చూపారంటూ సోంపేట మండలానికి చెందిన నేతలు డాక్టర్ ఎన్.దాసు, కంచిలి ఏఎంసీ చైర్మన్ పి.వి.రమణ నేతృత్వంలో పలు పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉన్నారు. పరిస్థితిని గమనించిన కృపారాణి వారి వద్దకు వెళ్లి సముదాయించడంతో వెనుక సీట్లలో కూర్చున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాలా, మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద, కె.రామ్మోహనరావు, ఏఎంసీ చెర్మైన్లు శ్యాంపురియా, పి.వి.రమణ, గ్రంథలయ సంస్థ చెర్మైన్ డీఎస్‌కే ప్రసాద్, ముస్తాక్ అహ్మద్, శ్రీదేవమ్మ, బర్ల నాగభూషణం, పాండవ చంద్రశేఖర్, మధు, నీలాచలం, దేవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement