శ్రుతిహాసన్‌ను వేధించేందుకే ఈ పిటిషన్లు | These petitions to srutihasan harassment | Sakshi
Sakshi News home page

శ్రుతిహాసన్‌ను వేధించేందుకే ఈ పిటిషన్లు

Published Sat, Apr 18 2015 12:13 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

శ్రుతిహాసన్‌ను వేధించేందుకే ఈ పిటిషన్లు - Sakshi

శ్రుతిహాసన్‌ను వేధించేందుకే ఈ పిటిషన్లు

కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు
వేరే సినిమాల్లో నటించకూడదన్న ఉత్తర్వులు రద్దు చేయండి
కోర్టుకు విన్నవించిన  శ్రుతి తరపు న్యాయవాది

 
హైదరాబాద్: సినీ కథానాయిక శ్రుతిహాసన్ కేసు వివాదం మరో మలుపు తిరిగింది. పిక్చర్ హౌజ్‌మీడియా సంస్థ వాస్తవాలను దాచి పిటిషన్లు దాఖలు చేస్తూ.. కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆమె తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. శ్రుతిహాసన్‌పై పిక్చర్ హౌజ్‌మీడియా లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను 25వ అదనపు చీఫ్ జడ్జి సాంబశివరావు నాయుడు శుక్రవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా శ్రుతిహాసన్ స్థానంలో మరో కథానాయిక తమన్నాతో ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్‌లోనే సినిమా షూటింగ్ నిర్వహిస్తూనే.. తమ సినిమా షూటింగ్ ముగిసే వరకు శ్రుతి హాసన్ మరో సినిమాలో నటించకుండా ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారని ఆయన వివరించారు. కోర్టును ఆశ్రయించకముందే గత నెల 25న తమన్నాతో పిక్చర్ హౌజ్ మీడియా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.

ఈ విషయాన్ని బయట పెట్టకుండా కోర్టును తప్పుదోవ పట్టించి, శ్రుతిహాసన్ మరో సినిమాకు సంతకం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు పొందారని చంద్రసేన్ పేర్కొన్నారు. పిక్చర్ హౌజ్‌మీడియా లిమిటెడ్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు శ్రుతిహాసన్‌కు రూ.10 లక్షల అడ్వాన్స్ చెల్లించలేదని, కాల్‌షీట్ల కోసం నెల రోజుల ముందే ఆమెను సంప్రదించాల్సి ఉండగా ఏప్రిల్ 2 నుంచి షూటింగ్‌కు రావాలంటూ కొన్ని రోజుల ముందే కోరారని చెప్పారు. అయితే శ్రుతి హాసన్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడంతో ఇదే విషయాన్ని మీడియా హౌజ్ ప్రతినిధులకు తెలిపిందని పేర్కొన్నారు. అడ్వాన్స్ చెల్లించకపోవడంతోపాటు అగ్రిమెంట్‌ను మీడియా హౌజ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వీరి మధ్య జరిగిన ఒప్పందం చెల్లదని వివరించారు. శ్రుతిహాసన్ కొత్త సినిమాలతో ఒప్పందం చేసుకోరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై తమ వాదన వినిపించేందుకు గడువు కావాలని మీడియా హౌజ్ తరఫు న్యాయవాది గడువు కోరవడంతో విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీలు కథానాయకులుగా నటించనున్న సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించేందుకు పిక్చర్ మీడియా హౌజ్‌ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement