
ఏసీబీ వలలో గూడూరు ఎస్సై
ఓ కేసు విషయమై లంచం తీసుకున్న గూడూరు ఎస్సై అడపా ఫణిమోహన్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. గూడూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
గూడూరు : ఓ కేసు విషయమై లంచం తీసుకున్న గూడూరు ఎస్సై అడపా ఫణిమోహన్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. గూడూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఆర్ విజయపాల్ తెలిపిన వివరాల ప్రకారం..
మండల పరిధిలోని కంచాకోడూరు గ్రామంలో గత జూలై ఆరో తేదీన పంచాయతీ చెరువు వేలంపాట విషయమై గ్రామ సర్పంచ్, గంటా గంగాధరరావు వర్గాల నడుమ వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గంగాధరరావు, గంటా సురేష్, ఈవని పాండురంగారావు తదితరులపై సర్పంచ్ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులతో పాటు సర్పంచ్ వర్గీయులు కూడా ఫిర్యాదులు చేయడంతో పరస్పరం కేసులు నమోదయ్యాయి.
అయితే సర్పంచ్ వర్గీయులను అరెస్టు చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారు. దీనిపై గంగాధరరావు తదితరులు పలుమార్లు ఎస్సైని కలిసి అడిగినప్పటికీ దాట వేస్తూ వచ్చారు. తనకు కొంత మొత్తం ఇస్తే కేసును ఎత్తి వేసే ప్రయత్నం చేస్తానని గంగాధర రావుకు ఎస్సై ఇటీవల చెప్పారు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేని గంగాధరరావు శుక్రవారం ఏసీబీ అధికారులను కలిశారు. దీనిపై ఆ శాఖ డీఎస్పీ విజయపాల్ ప్రణాళికాబద్దంగా తమ సిబ్బందితో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గంటా గంగాధరరావును స్టేషన్‌లోకి పం పారు.
రసాయనాలు చల్లిన రూ.7వేలను గంగాధరరావు ఎస్సై ఫణిమోహన్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ సిబ్బందితో దాడి చేసి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై చేతులను రసాయనిక ద్రావణం లో కడుగగా, గులాబి రంగు వచ్చింది. దీంతో ఎస్సైని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. ఈ దాడిలో ఆ శాఖ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఉలిక్కిపడ్డ ప్రభుత్వాధికారులు
గూడూరు ఎస్సై ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిసి మండల అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్టేషన్ వద్ద స్థానికులు, వివిధ గ్రా మాల సర్పంచులు గుమిగూడారు. సాయంత్రం ఐదు గంటలకు లోపలకు ప్రవేశించిన ఏసీబీ అధికారులు.. ల్యాండ్, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎక్కడి వారిని అక్కడే ఉండాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. గూడూరు ఎస్సైగా ఫణిమోహన్ తొమ్మిది నెలల కిందటే బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఎస్సైని కుట్రపూరితంగా ఏసీబీకి పట్టిచ్చారని ఆరోపిస్తూ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.