
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్‌లను విపరీతంగా వాడుతుండటం వల్ల కోట్లాది మంది కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు వీరిలో మెడనొప్పి కూడా ఎక్కువవుతున్నట్లు తేలింది. తాజాగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా వినియోగించే వారిలో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు, భారత్ లాంటి దేశాల్లో ఎక్కువగా ‘టెక్ట్స్నెక్ సిండ్రోమ్’కు గురవుతున్నట్టు తెలిపింది. అంటే మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నవారిలో ఎక్కువ మంది మెడ నొప్పితో బాధపడుతున్నారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ ఎర్గొనోమిక్స్ అనే జర్నల్ సైతం టెక్ట్స్నెక్ సిండ్రోమ్ పెద్ద భూతంలా వేధిస్తోందని వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చిన్న వయసులోనే మెడనొప్పితో బాధపడుతూ న్యూరో ఫిజీషియన్లు, వెన్నుపూస వైద్య నిపుణుల దగ్గరకు పరుగులు పెడుతున్న తీరు వైద్య వర్గాలను కూడా కలవరపెడుతోంది. ఈ సిండ్రోమ్ కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతిని భవిష్యత్‌లో అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తుండటం గమనార్హం.
సాక్షి, అమరావతి: ప్రధానంగా ఫోన్‌లో టెక్ట్స్మెసేజ్‌లు ఎక్కువసేపు చూస్తూండటంవల్ల మెడ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. దీంతో మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల విపరీతమైన తలనొప్పి, భుజాల నొప్పి వస్తుంది. ఇవి ఇలాగే కొనసాగి తొడ నుంచి పాదం వరకూ జాలుగా నొప్పితో ఇబ్బందిపడతారు. దీనివల్ల 80 శాతం మంది నిద్రలేమిని ఎదుర్కొంటున్నారు. ప్రతి చిన్న విషయానికి చిరాకుపడటం, ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెడ నరాలు అరిగిపోవడం లేదా ఒత్తిడికి గురికావడం వల్ల వెన్నుపూసపై కూడా ప్రభావం పడుతున్నట్టు ఏఎస్‌ఎస్‌ఏపీ (అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వైద్య బృందం ధ్రువీకరించింది. నాడీ వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్న వాటిలో ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్’ ప్రధానమైందిగా ఈ బృందం పేర్కొంది.
చిన్న వయసులోనే సిండ్రోమ్..
తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల మందిపైనే స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నట్టు ప్రాథమిక అంచనా. 18 నుంచి 43 ఏళ్ల మధ్య ఉన్నవారు స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరిలో టెక్ట్స్నెక్ సిండ్రోమ్ బారిన పడి ఏదో ఒక దశలో వైద్యానికి వెళ్తున్నవారు 53 శాతం మంది ఉన్నట్టు తేలింది. వీరిలో తీవ్ర మెడ నొప్పితో బాధపడుతున్నవారు 31 శాతం మంది పైనే ఉన్నట్టు వైద్య నిపుణుల అంచనా. వీరిలో 20 ఏళ్ల యువతీయువకులూ ఉన్నారు. 30 ఏళ్లకు పైనున్నవారిలో తీవ్రత ఎక్కువ. సగటున 110 నిమిషాలు మెడలు పూర్తిగా వంచి మెసేజ్‌లు చూస్తున్నట్టు న్యూరో నిపుణుల సర్వేలో వెల్లడైంది. వాస్తవానికి మెడ 10 నుంచి 12 పౌండ్‌ల బరువు మోయగలదని, కానీ మెసేజ్‌లు చదవడానికి మెడను వంచడంవల్ల 60 పౌండ్‌లు మోయాల్సి వస్తుందని తేల్చారు.
పెరుగుతున్న బాధితుల సంఖ్య
పద్నాలుగేళ్ల చిన్నారులు కూడా టెక్స్›్టనెక్ సిండ్రోమ్ బారిన పడి వైద్యం కోసం వస్తున్న తీరు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. దీన్నిబట్టి మొబైల్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. మెడ నరాలు, కండరాలపై తీవ్ర ప్రభావం పడకముందే జాగ్రత్త పడాలి. లేదంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు చిన్నారుల అల్లరి నుంచి బయటపడేందుకు వారికి సెల్‌ఫోన్‌లు ఇచ్చి వీడియో గేమ్‌లు ఆడిస్తున్నారు. దీంతో చిన్నతనంలోనే వారిపై దుష్ప్రభావం పడుతోంది. రోజుకు ఐదారుగురు మెడనొప్పితో మా దగ్గరకు వస్తున్నారు. అయితే మందుల వాడకం, శస్త్రచికిత్స కంటే వ్యాయామమే దీనికి సరైన మందు.
– డా. జె. నరేశ్‌బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు, గుంటూరు
టెక్ట్స్ నెక్ సిండ్రోమ్‌కు వైద్యుల సూచనలు.. సలహాలు..
- రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువగా మెడ వంచి మెసేజ్‌లు చూడకూడదు.
- మెడను కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి.
- తరచూ అర చేతులు ఆన్చి గట్టిగా తలను వెనక్కు, ముందుకు నెడుతుండాలి.
- పదే పదే చేతులను పైకెత్తి కిందికి దించడం వల్ల భుజాలకు కాస్త వ్యాయామం ఉంటుంది.
- తరచూ సూర్య నమస్కారాలతోపాటు కొన్ని రకాల ఆసనాలు వేస్తే మెడకు, తలకు, భుజాలకు వ్యాయామం చేకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment