బరిలో వీరే...
- ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- లోక్‌సభ బరిలో 33 మంది
- అసెంబ్లీ బరిలో 227 మంది
- చివరిరోజు 75 మంది ఉపసంహరణ
- స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు
- నాలుగు అసెంబ్లీ, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు ఈవీఎంల వినియోగం
- ఇక హోరెత్తనున్న ప్రచారం
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. చివరిరోజు 75 మంది తమ నామినేషన్లను ఉపసంహరించారు. దీంతో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కతేలింది. విజయవాడ లోక్‌సభ స్థానానికి 22 మంది, మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి 11 మంది బరిలో నిలిచారు. అసెంబ్లీ పరిధిలో 16 నియోజకవర్గాల్లో 228 మంది పోటీలో ఉన్నారు. విజయవాడ తూర్పులో అత్యధికంగా 23 మంది పోటీలో ఉండగా, నందిగామ, పెడనలలో తొమ్మిది మంది అత్యల్పంగా బరిలో నిలిచారు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కతేలింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగియగా చివరిరోజు 75 మంది తమ నామినేషన్లను ఉపసంహరించారు. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి ఒకరు, విజయవాడ లోక్‌సభ అభ్యర్థులు ఐదుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు 33 మంది, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మచిలీపట్నం లోక్‌సభకు 11, విజయవాడ లోక్‌సభకు 22 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
ఐదు స్థానాలకు రెండు ఈవీఎంలు...
ఈవీఎంలలో 15 మంది అభ్యర్థులకు సంబంధించిన గుర్తులే ఉంటాయి. మరో గుర్తు నోటాగా ఉంది. ఒక్కొక్క ఈవీఎంలో 16 గుర్తులే ఉండటంతో 15 మంది కన్నా ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్నచోట రెండో ఈవీఎంను అధికారులు ఉపయోగించాల్సి ఉంది. తిరువూరులో 20 మంది, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 22, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 17, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క పోలింగ్ బూత్‌లో రెండు ఈవీఎంలను వినియోగించాల్సి ఉంది. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఈ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంది.