కుట్రలు తిప్పికొడతాం | They attack people's self-worth | Sakshi
Sakshi News home page

కుట్రలు తిప్పికొడతాం

Published Thu, Sep 5 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

They attack people's self-worth

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘ఆస్తుల ఆపేక్షతోనే సీమాంధ్ర పెట్టుబడిదారులు సమైక్య ఉద్యమంతో రెచ్చగొడుతున్నారు... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడిని సహించం... పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదమయ్యేవరకు అప్రమత్తంగా ఉండి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్రలు తిప్పికొడతామని టీజేఏసీ, టీఎన్జీవోస్, టీఆర్‌ఎస్ నేతలు ఉద్ఘాటించారు. ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా టీజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ఉద్యోగులు, విద్యార్థులు, నాయకులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించి, శాంతి దీక్ష చేపట్టారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ సకలజనుల సమ్మె సమయంలో తెలంగాణవారిపై అనేక కేసులు పెట్టారని, ప్రస్తుత సీమాంధ్ర ఉద్యమానికి పోలీసులే రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్రుల దాడులు అరికట్టాలని, విచారణ నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఉమ్మడి రాజధాని ప్రతిపాదనపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 7న నిర్వహించనున్న ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, అదే రోజు టీజేఏసీ నిర్వహించనున్న ర్యాలీకి ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు. టీజేఏసీ రాష్ట్ర కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మ య్య మాట్లాడుతూ ఉద్యమం ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించాలని, సమైక్యాంధ్ర కోసం అక్కడి నాయకులు అర్థం లేని ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. పది జిల్లాలతోనే కూడిన తెలంగాణనే ప్రజలు అంగీకరిస్తారని, హైదరాబాద్‌ను తాత్కాలిక రాజధానిగానే ఒప్పుకుంటారని తెలిపారు.
 
 శాంతిని భగ్నం చేస్తే మరో ఉద్యమం
 టీజేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ సీఎం కిరణ్ కుట్రలో భాగంగానే ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణలో శాంతిని భగ్నం చేయాలని చూస్తే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. టీడీపీ నేత చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రతో ఆయన నైజం బయటపడిందన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు ఉద్యమంలోకి రావాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకునే కుట్రలు తిప్పికొట్టాలన్నారు. టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
 
 ఆర్టీసీ టీఎంయూ నాయకుడు థామస్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభను బస్సులతో అడ్డుకునేందుకైనా సిద్ధమన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏపీఎన్జీవోస్ తలపెట్టిన సభ తెలంగాణ గుండెల మీద గుద్దే సభ అని అన్నారు. సీల్డ్ కవర్‌లో వచ్చిన సీఎం కేవలం సీమాంధ్రకే సీఎంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇస్తే ఏం జరుగుతుందో చూడాలని హెచ్చరించారు.
 
 మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ విభజనతో వచ్చే నష్టాలు చెప్పలేని సీమాంధ్ర పెట్టుబడిదారులు దోపిడీ సాగదనే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారన్నారు. ర్యాలీ, దీక్షలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ వెంకటమల్లయ్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.ఏ. హమీద్, నర్సింహస్వామి, కేంద్ర సంఘం నాయకులు జగదీశ్వర్, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి సమ్మయ్య, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుస్సేన్‌తోపాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
 
 తెలంగాణ బంద్ యోచన
 తిమ్మాపూర్ : ఈ నెల 6, 7 తేదీల్లో 48 గంటలపాటు తెలంగాణ బంద్ నిర్వహించాలనే యోచన ఉందని టీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ వెల్లడించారు. తిమ్మాపూర్‌లోని ఆర్టీవో కార్యాలయంలో ఉద్యోగులను కలిసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న శాంతియాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయనవెంట రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, ఉద్యోగులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement