తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం! | Thiefs Target Was Only Locked Houses | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం!

Published Sat, Mar 9 2019 4:07 PM | Last Updated on Sat, Mar 9 2019 5:08 PM

Thiefs Target Was Only Locked Houses - Sakshi

వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌ టీం 

సాక్షి, తిరువూరు : తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం సమీపంలోని ఒక నివాసంలో చోరీ జరిగింది. అటవీశాఖలో పనిచేస్తున్న పెరికె మోహినీ విజయలక్ష్మి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్లకు వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చా రు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో తమ నివాసంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. మూడు రోజులుగా ఇంటి తలుపులు తీసి ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎస్‌ఐ మణికుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ.3 లక్షల నగదు, 300 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు.  సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. విలువైన దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు సైతం చోరీకి గురయ్యాయి.


క్లూస్‌ టీం దర్యాప్తు
మచిలీపట్నం క్లూస్‌ టీంను, డాగ్‌ స్క్వాడ్‌ దర్యాప్తు చేపట్టారు.  నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్‌ ప్రాథమిక సమాచారం సేకరించిన అనంతరం తిరువూరు సర్కిల్లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా అగంతకులు చోరీలకు పాల్పడుతున్నందున ముందస్తు బందోబస్తు కల్పించాలని, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, గుర్తుతెలియని వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసుస్టేషనుకు సమాచారం అందించాలని స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement