
ఈ మరణం దారుణం..
అప్పుల బాధలు తాళలేక యవరైతు ఆత్మహత్య
హుద్‌హుద్ తుపానుకు నాలుగున్నర
ఎకరాల పత్తిపంట, ఎకరా వరి పంట మునక...
ప్రైవేటు ఫైనాన్స్‌తోపాటు ఇతరత్రా అప్పులు...
పురుగు మందు తాగి కోమాలోకి...
చికిత్స అందిస్తుండగా మృత్యు ఒడిలోకి...
అనాథలైన భార్యా, పిల్లలు...
ఆరుగాలం శ్రమ ఒక్క రోజులో ఊడ్చిపెట్టుకుపోయింది...ఆదుకుంటుందని భావించిన ప్రభుత్వం పట్టించుకోలేదు...చేసిన అప్పులు తీర్చలేక, అప్పులు ఇచ్చేవారి ఒత్తిడి భరించలే క, కనీసం పండుగ కూడా చేసుకోడానికి ఖర్చుకు డబ్బులు లేక దిక్కుతోచని దయనీయ స్థితిలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కార్ నిర్లక్ష్యానికి, రాకాసి పిట్ట (హుద్‌హుద్) బీభత్సానికి బలైపోయాడు.
పార్వతీపురం: ఓ వైపు హుద్‌హుద్ దెబ్బతో చేతికి రాని పంట...మరో వైపు వేధిస్తున్న అప్పులు...ఇంకో వైపు ఆదుకోని ప్రభుత్వం ఈ తరుణంలో ఏం చేయాలో పాలుపోక కొమరాడ మండలం కొరిశీల గ్రామానికి చెందిన బడే చంద్ర పాత్రుడు(26) అనే శుక్రవారం పత్తిచేలకు వేసే పురుగు ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబీకులు చంద్ర పాత్రుడును హుటా హుటీన పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు చికిత్స అందిస్తుండగా...కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. దీనికి సంబంధించి ఆతని కుటుంబ సభ్యులు బడే నరేష్, సీహెచ్ నూకరాజు, జమ్మల పోలారావు, బడే తిరుపతి పాత్రుడు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి...
కొమరాడ మండలంలోని గుణదతీలేసు పంచాయతీ కొరిశిల గ్రామానికి చెందిన బడే చంద్ర పాత్రుడు గ్రామంలోని ఊర చెరువు పక్కన సుమారు నాలుగున్నర ఎకరాల్లో పత్తి పంటను వేశాడు. విత్తనాలు మొదలుకొని, పురుగుమందుల వరకూ అన్నింటికీ అప్పు చేసి పంటకు మదుపు పెట్టాడు. పంట చేతికొస్తుందనుకునే సమయంలో విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాను పంటను మట్టిపాలు చేసింది. చెరువు పక్కనే ఉన్న చంద్రపాత్రుడు పొలం యావత్తూ మునిగిపోయింది. నాలుగున్నర ఎకరాలకు కనీసం రెండు క్వింటాళ్ల పత్తి కూడా రాలేదు. ఓ ఎక రంలో వేసిన వరి చేనుకూడా నీట మునిగి మొత్తం పాడైపోయింది. కనీసం కోసేందుకు కూడా పనికిరాకుండా పోయింది. ఈ తరుణంలో పండుగ దగ్గరపడుతుండడంతోపాటు అప్పులోళ్లు ఒత్తిడితో గత కొద్ది రోజులుగా మానసికంగా ఆందోళనకు గురై చిరాకుగా ఉండేవాడు. పంట కోసం ప్రైవేటు ఫైనాన్స్‌తోపాటు, గ్రామానికి చెందని సాదర సొమ్ము, ఇతరుల వద్ద పలు అప్పులు చేశాడు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చేందుకు మార్గం కనిపించకపోవడంతో శుక్రవారం పొలంలో పత్తి చేలకు వాడే పురుగు మందు తాగి ఇంటికొచ్చాడు. మాట తడబడడంతో విషయం అడిగితే తాను పురుగుల మందు తాగినట్లు చెప్పడంతో మండలంలోని కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స చేసిన వైద్యులు, పరిస్థితి విషమించడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
అనాథలైన భార్యా, పిల్లలు...
బడే చంద్ర పాత్రుడుకు భార్య భాగ్యలక్ష్మి, మూడేళ్ల కూతురు సంజన, ఆరు నెలల బాబు షణ్ముఖ్ ఉన్నారు. ఇంటిని నడపాల్సిన వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబం అనాథయ్యిందని ఆ గ్రామస్తులు తెలిపారు. చిన్న వ యసులో మృత్యువాత పడడంతో ఆ గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.