ఇదీ.. పల్లె లెక్క! | .. This is a calculation of the countryside! | Sakshi
Sakshi News home page

ఇదీ.. పల్లె లెక్క!

Published Mon, Mar 16 2015 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

.. This is a calculation of the countryside!

సాక్షి, కర్నూలు : పంచాయతీల్లో ప్రజల జేబులు ఖాళీకానున్నాయి. ప్రజలపై భారీగా పన్ను పోటుకు పంచాయతీ అధికారులు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుకుండడంతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడకుండా.. గ్రామీణ ప్రజలపై పన్నుల భారం మోపి పంచాయతీల ఖజానా నింపుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఇంటి పన్నుతో పాటు ఖాళీ స్థలాలు, భూములతో పాటు వాహన పన్ను, వీధి దీపాల పన్ను, కూరగాయల మార్కెట్ వంటి అన్ని రకాల వ్యవహారాలపైనా పన్నులు బాదనుంది. ఇలా దాదాపు 48 రకాల పన్నులను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని పలు పంచాయతీల్లో పన్నులు పెంచుతున్నట్లు తీర్మానం కూడా చేశారు.
 
కాదేదీ పన్నులకు అనర్హం..

 జిల్లాలో 889 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి అభివృద్ధికి ఇప్పటిదాకా కేవలం ఆస్తి, కుళాయి పన్నులే ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇకపై ఇంటిపన్నులు, నీటిపన్ను, వీధిదీపాల పన్ను, డ్రైనేజీపన్ను, గ్రంథాలయ పన్ను, ప్రకటన పన్నులతో పాటు పన్నేతరులైన చెరువులు, మార్కెట్‌లు, సంతలు, లే-అవుట్ ఫీజు, సేవా రుసుము, ఆక్రమణ పన్నులు, వీధి దీపాల పన్నుతో పాటు వాహన పన్ను, ఖాళీ స్థలం లేదా భూమి ఉంటే పన్నును ఇలా మొత్తం 48 రకాల పన్నులు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పన్నుల భారం పెరగనుంది.  వచ్చే నెల నుంచి పంచాయతీ పాలన  ఆన్‌లైన్ కానున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన ఆయా గ్రామాలకు వచ్చే ఆదాయాలతోనే చేపట్టేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.   
 
ఉపాధి పనులపైనా ప(క)న్ను...!
పంచాయతీల ఖజానాను నింపేందుకు ప్రభుత్వం ఏకంగా కూలీ పనుల మీదా కన్ను వేసింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో అమలయ్యే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులపైనా పన్ను వసూలు చేయడానికి సిద్ధపడుతోంది. అదేవిధంగా పోరంబోకు భూములతో పాటు చివరకు మరుగునీరు (డ్రైనేజీ వ్యవస్థ) నిర్వహణకు కూడా పన్నులు వసూలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇక మీద గ్రామాల్లో షాపులు పెట్టుకునే వారే కాకుండా వీధుల్లో ఏర్పాటు చేసుకునే తోపుడు బండ్ల నిర్వాహకులు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద అది ఇదీ అని తేడా లేకుండా అన్ని రకాల వ్యవహారాలపైన పన్నులు వసూలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది.
 
నిండుకున్న ఖజానా..
పంచాయతీలను ఆదుకోవాల్సిన సర్కారు సైతం పంచాయతీల ఆర్థిక వనరులనూ గుంజేసుకోవడంతో పంచాయతీల్లో ఖజానా నిండుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపు మూడేళ్ల పాటు పాలకవర్గాలు లేకపోవడంతో అధికారులే పాలన సాగించారు. అయితే ఆర్థిక లేమితో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. పైగా కేవలం ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడాల్సి రావడంతో ఆ నిధులతోనే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే... గోరుచుట్టపై రోకటిపోటులాగా విద్యుత్ బిల్లులను కూడా పంచాయతీలే చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులల్లో 70 నుంచి 80 శాతం మేరకు కేవలం విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పంచాయతీలు ఆర్థికంగా కుంగిపోయాయి. అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితులల్లో ప్రజల జేబులు కొల్లగొట్టడం ద్వారా నిధులను సమకూర్చుకునేందుకు 48 రకాల పన్ను జాబితాను రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement