దేశ చరిత్రలో ఇదే ప్రథమం
దేశ చరిత్రలో ఇదే ప్రథమం
Published Thu, Jan 26 2017 4:49 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
తనను నిర్బంధించడం అన్యాయమని, ఒక ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తమను నిర్బంధించడం అన్యాయమని, ప్రతిపక్ష నాయకులకు ఉన్న రాజకీయ హక్కులను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ విమానాశ్రయం రన్‌వే మీద బైఠాయించిన ఆయన.. తనతో సహా పలువురు ఎంపీలు, నాయకులను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు చేసిన ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్రానికి మేలుచేసే అంశం కోసం శాంతియుతంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తామంటే.. దాన్ని అడ్డుకునేందుకు ఏకంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం రన్‌వే మీదనే అరెస్టు చేసిన ఘటన విశాఖపట్నంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతాయని, తద్వారా ఉద్యోగావకాశాలు వస్తాయని భావించి, కేవలం ఒక మౌన ప్రదర్శన చేస్తామంటే విమానాశ్రయం నుంచే నిర్బంధం లోకి తీసుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. జర్కిన్లు, ట్రాక్ సూట్‌లు వేసుకుని ఉన్న కొంతమంది వచ్చి వైఎస్ జగన్ తదితరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అసలు వాళ్ల వద్ద ఐడీ కార్డులు కూడా లేకపోవడంతో వాళ్లు పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అదే విషయమై అడిగినా ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం. కాగా, లోపల జగన్‌ను నిర్బంధించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసి విమానాశ్రయం బయట పెద్ద సంఖ్యలో యువత గుమిగూడారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Advertisement
Advertisement