భూములిచ్చిన రైతులతో సర్కారు చెలగాటం
► ఇళ్లు కూడా తొలగించి, ఊరి నుంచి పంపేసే యత్నం
► మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజం
► బాధితులకు అండగా ఉంటామని భరోసా
యర్రబాలెం (తాడేపల్లి రూరల్): రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులతో ఇక పనేముంది అన్నట్టు మన రాష్ట్ర మంత్రులు వ్యవహరిస్తున్నారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. యర్రబాలెం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో ఆదివారం మాజీ సర్పంచ్ పలగాని తాతారావు నివాసంలో ఎమ్మెల్యే ఆర్కే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భూములు ఇచ్చారు..వారి ఇళ్లను కూడా తొలగిస్తే రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోతారన్న ఉద్దేశ్యంతోనే మీ నివాసాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధానిలో భూములు తీసుకునేంతవరకు అనయ్య, తమ్ముడు, బావ అంటూ... మీ ఇళ్ల చుట్టూ తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక మీకు కనిపించరు... ఎందుకంటే రాజధాని ప్రాంతంలో రైతుల భూములతో వారు వ్యాపారం చేయాలంటే మిమ్ముల్ని గ్రామాల్లో లేకుండా చేయాలి.
అప్పుడు మాత్రమే వారు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుంది’ అన్నారు. భూములు తీసుకునేటప్పుడు గ్రామ కంఠాల జోలికి రానన్న మంత్రి నారాయణ, గ్రామంలో సగం ఇళ్లు పోతుంటే ఎందుకు మాట్లాడడంలేదని ఆర్కే ప్రశ్నించారు. ‘30 వంకర్లు ఉన్న రోడ్డును మలుపులు లేకుండా నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఎర్రబాలెం చెరువు దగ్గర నుంచి పొగాకు కంపెనీ వరకు పంట పొలాలను కలుపుకుంటూ 60 అడుగుల రోడ్డు ఉంది. దాని నిర్మాణం చేపడితే రైతులు తమ నివాసాలను కోల్పోకుండా సంతోషంగా ఉంటారు కదా!’ అన్నారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తే రైతులు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో రాజధానిలోని 29 గ్రామాల్లో కనబడకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
నివాస గృహాలు కోల్పోతున్న వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో న్యాయం పోరాటం చేస్తామని ఆర్కే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంగళగిరి, దుగ్గిరాల ఎంపీపీలు పచ్చల రత్నకుమారి, రజనీకాంత్, వైఎస్సార్‌సీపీ మంగళగిరి మండల అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, యర్రబాలెం గ్రామ అధ్యక్షుడు సుధా బుజ్జి, ఎంపీటీసీ సభ్యులు సుధా హనుమాయమ్మ, పలగాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎవరిని అడగాలి...
30 వంకర్లు ఉన్న రోడ్డును విస్తరణ చేస్తే గ్రామం సగం రోడ్లకే పోతు ంది. మార్కింగ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే సీఆర్‌డీఏ కార్యాలయంలో అడగాలని సమాధానం ఇస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో అడిగితే తమకు తెలియదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి మేమెవరిని అడగాలి?
- పలగాని కోటేశ్వరరావు
మేమెక్కడ ఉండాలి...
రాజధాని రోడ్ల పేరుతో పేదల ఇళ్లు తొలగిస్తే మేమెక్కడ నివాసం ఉండా లి? తిన్నా తినకపోయినా సొంత ఇంటిలో నివాసం ఉంటే అడిగే వారే ఉండరు. ఆ ఇల్లే నాకు జీవనోపాధి. దానిలో హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు నా గతేంకాను?
- సూర్యనారాయణ