ఈసారి బడ్జెట్ పెరగదు...
- రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నిటికీ ఆర్థికశాఖ నోట్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2015-16) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల కన్నా ఎక్కువగా ఉండవని.. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలు చేయాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేయడానికి ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ కార్యదర్శి (బడ్జెట్) ఎల్.ప్రేమచంద్రారెడ్డి సోమవారం అన్ని శాఖలకు ప్రత్యేకంగా నోట్ జారీ చేశారు. ఆర్థిక వనరులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్నట్లే ఉంటాయని.. కాబట్టి ప్రణాళికేతర వ్యయం వీలైనంత మేర తగ్గించేలా ప్రతిపాదనలు చేయాలని ఆ నోట్‌లో కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పథకాలకు ప్రతిపాదనలు చేయాలని, ప్రధానంగా ఎటువంటి పథకాలైనా ఏడు రంగాలకు చెందిన ప్రభుత్వం ప్రకటించిన మిషన్లకు సంబంధించినవై ఉండాలని పేర్కొన్నారు.
జీరో స్థాయి బడ్జెట్‌లో పద్దుల సంఖ్య తగ్గిస్తాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులకన్నా ఏ పథకానికైనా, కార్యక్రమానికైనా ఎక్కువ నిధులు కావాలంటే ఆ అంశాన్ని రెండో ప్రాధాన్యతగా ప్రత్యేకంగా కారణాలతో చూపాలని సూచించారు. అలాంటి రెండో ప్రాధాన్యతలపై ఆర్థిక వనరుల లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. అన్ని శాఖలు కూడా కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర నిధులు ఎంత వరకు రాబట్టారో కూడా వివరాలు సిద్ధం చేయాలని స్పష్టంచేశారు.