అసెంబ్లీలో బడ్జెట్‌ను చదువుతున్న ఆర్థిక మంత్రి యనమల. చిత్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చినరాజప్ప తదితరులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దాదాపు రెండు లక్షల కోట్లకు చేరువగా.. భారీ బడ్జెట్... కేంద్రం నుంచి రూ.50,696 కోట్ల గ్రాంట్లు.. సొంత ఆదాయం రూ.65,535 కోట్లు.. కేంద్ర పన్నుల్లో వాటా రూ.33,930 కోట్లు.. మిగులు రూ.5,235 కోట్లు.. ఏ రంగం చూసినా వేల కోట్ల కేటాయింపులు.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించిన 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఇలాంటి బడాయి అంకెలెన్నో కనిపిస్తాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి.. ఎన్నికల ఏడాది.. అందులోనూ చివరి బడ్జెట్ కనుకే అంకెల్లో అంత బడాయి.. అసలు సంగతి షరామామూలే... భారీగా కేటాయింపులు చేయడం, వాటికి సర్దుబాటు చేయలేక చతికిల పడటం రివాజుగా మారింది.
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చుకు.. బడ్జెట్‌లో కేటాయింపులకు పొంతనే లేదు. రుణమాఫీ పేరుతో రైతులను దారుణంగా వంచించారు. ఈ బడ్జెట్‌లోనూ వారికి ఒరిగింది శూన్యం. రూ.87,612 కోట్ల రుణాలున్నా చంద్రబాబు రూ.24వేల కోట్లేనని కుదించారు. వాటికి కూడా దశలవారీగా ఇచ్చింది అరకొరే.. వడ్డీలలో పావు వంతుకు కూడా మాఫీ సొమ్ము సరిపోలేదు. బాబును నమ్మి డిఫాల్టర్లుగా మారిన రైతులు వడ్డీలేని రుణాలకే కాదు కొత్త రుణాలకూ దూరమయ్యారు.
అచ్చం అలానే నిరుద్యోగులకూ ముఖ్యమంత్రి చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు.. ఇంటికో ఉద్యోగం– ఉపాధి అన్నారు... ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు... జాబు కావాలంటే బాబు రావాలన్నారు... ఇంకేముంది తలరాత మారిపోతుందని నిరుద్యోగులు తబ్బిబ్బయ్యారు.. ఎన్నికలు ముగిశాయి... చూస్తుండగానే నాలుగేళ్లు నడిచివెళ్లిపోయాయి.. కొత్తగా ఒక్క ఉద్యోగం లేదు సరికదా ఉన్న ఉద్యోగాలనే ఊడబీకుతున్నారు.. పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉపాధి అవకాశాలను పెంచి ఆర్థిక రంగ పరిపుష్టికి దోహదపడే సంజీవని వంటి ప్రత్యేకహోదాను గాలికొదిలేశారు.
ఎన్నికల ఏడాది కనుక ఈ 2018–19 బడ్జెట్‌లోనైనా తమకు న్యాయం చేస్తారని నిరుద్యోగులు ఎదురుచూశారు. వారికి ముఖ్యమంత్రి ‘చిల్లర’తో సరిపెట్టారు. నిరసనలు చూసి గతేడాది నిరుద్యోగులకు ఆర్థికసాయం అంటూ రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క పైసా కూడా విదల్చలేదు. అవి ఎటుపోయాయో తెలియదు. ఈ బడ్జెట్‌లో నిరుద్యోగులకు రూ.1,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబానికి రెండువేల చొప్పున నెలకు మూడువేల కోట్లు బకాయి. ఏడాదికి రూ.36వేల కోట్లు.. నాలుగేళ్లకు రూ.1.44 లక్షల కోట్లు బకాయి.
ఈ ఏడాది మరలా రూ.36 వేల కోట్లు బకాయి. అంటే మొత్తం రూ.1.76 లక్షల కోట్లు నిరుద్యో గులకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి ఉన్నదన్నమాట. మరి ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.1,000 కోట్లు ఏమూలకు? అవి కూడా వారికి ఖర్చుచేస్తారో లేదో దేవుడికే ఎరుక... ఇవే కాదు.. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చడానికి నాలుగు బడ్జెట్లలో కేటాయించింది శూన్యం.. ఐదో బడ్జెట్‌లోనూ అదే ఒరవడిని కొనసాగించారు. హామీలన్ని టినీ అటకెక్కించారు.
కమీషన్లకు వీలున్న సాగునీటిపారుదల శాఖకు మాత్రం భారీ కేటాయింపులు జరిపినా పనులు జరుగుతున్న దాఖలాలే లేవు. వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుకు సరేసరి.. డ్వాక్రా మహిళలకూ టోకరా ఇచ్చారు. రుణమాఫీకి సరిపడా కేటాయింపులే లేవు. ప్రజారోగ్యానికి కీలకమైన ఆరోగ్యశ్రీకి కోతలు విధించి..108 అంబులెన్సులు, 104 పథకా లకు ఎప్పటిలాగే అరకొర కేటాయించారు. సంక్షేమానికి నిధులు పెంచినట్లు కనిపిస్తున్నా గతేడాది ఖర్చు చేయని నిధులు వెక్కిరిస్తున్నాయి..
Comments
Please login to add a commentAdd a comment