నేడే బడ్జెట్
⇒ 10.25 గంటలకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి యనమల
⇒ 31 వరకు అసెంబ్లీ సమావేశాల పొడిగింపు.. బీఏసీలో నిర్ణయం
సాక్షి, అమరావతి
రాష్ట్ర వార్షిక బడ్జెట్(2017–18)ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదయం 10.25కు అసెంబ్లీలో ప్రవేశపెట్టను న్నారు. మంగళవారం వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీలోని తన కార్యాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు పాల్గొన్న సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి కారణంగా 13న సభ జరక్కపోవడం, 14న ఆయన మృతికి సంతాప తీర్మానం, దానిపై చర్చ తర్వాత సభ వాయిదా పడిన నేపథ్యంలో 30, 31 తేదీల్లోనూ సభ జరపాలని తీర్మానించారు.
16న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటాయి. 17న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఇవ్వగా, 18, 19 తేదీల్లో సాధారణ సెలవులు కావడంతో సభ జరగదు. తిరిగి 20వ తేదీన ప్రారంభమైన సభలో బడ్జెట్‌పై చర్చ అనంతరం వాటిపై ఆర్థిక మంత్రి సమాధానాలిస్తారు. 21 నుంచి 25 వరకూ సభ జరుగుతుంది. 26న సెలవు. ఆమోదించాల్సిన కొన్ని బిల్లులుండడంతో 27వ తేదీన రెండుపూటలా సభ నిర్వహిస్తారు. 28వ తేదీన సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతారు. 29న పండుగ సెలవు తర్వాత 30, 31 తేదీల్లో రెండుపూటలా సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.
నేడు మంత్రివర్గ సమావేశం
మరోవైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించడం కోసం బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.