నిలిచిన పామోలిన్ సరఫరా
- ఎన్నికల వేళ పేద ప్రజలకు షాక్
- డీడీలు కట్టిన రేషన్ డీలర్ల ఆందోళన
- 40 శాతం సరఫరా బంద్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెలా పేదలకు పంపిణీ చేస్తున్న పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. విదేశాల నుంచి సరఫరా కావాల్సిన సరకు రాకపోవడంతో కొరత ఏర్పడింది. గత నెలలో సరకు రాకపోవడంతో జిల్లాకు ఏప్రిల్‌లో కోత విధించారు. దీంతో విజయవాడ నగరంలో, జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఏప్రిల్‌లో పామోలిన్ పంపిణీ జరగలేదు.
జిల్లాలో ఏప్రిల్‌లో 1,178.47 టన్నుల పామోలిన్ సరఫరా కావాల్సి ఉండగా, 666.709 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 శాతం పామోలిన్ కోటా రద్దయింది. దీంతో విజయవాడ నగరంలోని 255 చౌక ధరల దుకాణాల్లో 201.670 టన్నుల పామోలిన్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు.
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, పెడన, గూడూరు, మండవల్లి, ఇబ్రహీంపట్నం, నూజివీడు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి మండలాలకు ఈ నెలలో పామోలిన్ సరఫరా కాలేదు. ఈ క్రమంలో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు నెలల్లో కూడా స్టాక్ రాదని అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో పామోలిన్ కోసం వేలాది రూపాయలు డీడీలు తీసి చెల్లించిన రేషన్ డీలర్లు ఆందోళనకు గురవుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యే : జిల్లా డీఎం
పామోలిన్ సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిందని జిల్లా పౌరసరఫరాల అధికారి చిట్టిబాబు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 32 శాతం మాత్రమే పామోలిన్ సరఫరా కాగా, జిల్లాలో 60 శాతం సరఫరా చేశామని తెలిపారు. విదేశాల సరకుతో కూడిన షిప్ రాకపోవటంతో సరఫరా నిలిచిపోయిందని ఆయన వివరించారు.