Tonnes
-
భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఒకప్పటి నుంచి బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్పా.. భారీగా తగ్గుముఖం పట్టిన రోజులు చాలా తక్కువ. అయినా కొనే వారు కొంటూనే ఉన్నారు, ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో ప్రపంచములో బంగారం ఎవరి దగ్గర ఎక్కువగా ఉంది? ఉత్పత్తిలో భారత్ స్థానం ఏంటనే వివరాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగారం అనేది ఈ రోజు వాడుకలో వచ్చింది కాదు, శతాబ్దాల ముందు నుంచి ప్రజలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలా వరకు బంగారం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. భారతీయ కుటుంబాల దగ్గర ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్నట్లు సమాచారం. నిజానికి భారతీయులు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బంగారాన్ని భారీగా ఉపయోగిస్తారు. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం దాదాపు 25000 టన్నుల కంటే ఎక్కువని సమాచారం. ఇదీ చదవండి: ఈ ఏడాది 1996 క్యాలెండర్స్ వాడుకోండి..! ఎందుకంటే? ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతం బంగారం భారతీయుల వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ఇది అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాలకంటే ఎక్కువ. భారత్ తరువాత అత్యధిక బంగారం ఉన్న దేశీయులలో సౌదీ అరేబియా, అమెరికా, కెనడా మొదలైనవి ఉన్నాయి. -
నల్లగా మారిన ఆకాశం.. వణికిపోతున్న అధ్యక్షుడు బైడెన్..
కెనడాని కార్చిచ్చు వణికిస్తోంది. చాలా రోజులుగా కొనసాగుతున్న దావానలంతో తమ దేశ చరిత్రలో ఇప్పటివరకు లేనంతగా వాయు కాలుష్యం జరిగినట్లు ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కెనడా తూర్పూ, పశ్చిమ భాగాల్లో సంభవించిన కార్చిచ్చుతో రికార్డ్ స్థాయిలో 160 మిలియన్ టన్నుల కార్బన్ విడుదలైనట్లు పేర్కొంది. దీంతో అటు పక్కనే అమెరికా కూడా చిక్కుల్లో పడింది. యూఎస్ గగనతలాన్ని పొగలు కమ్మేశాయి. న్యూయార్క్, టొరెంటో నగరాల్లో ఆకాశం నల్లని దుప్పటి కప్పినట్లు తయారైంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో చాలా రోజులుగా అడవుల్లో మంటలు చెలరేగాయి. బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, సస్కట్చేవాన్, తూర్పున అంటారియో, క్యూబెక్, నోవా స్కోటియాతో సహా పలు ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. మే నెల నుంచే ఆదేశ అధికార యంత్రాంగం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం 490 ప్రదేశాల్లో మంటలు చెలరేగగా.. 255 ప్రదేశాల్లో నియంత్రించలేని స్థితిలో దావానలం వ్యాపించింది. మిన్నెసోటా, మిన్నియాపాలిస్లలో వాతావరణం నల్లగా మారిపోయింది. దీంతో మంగళవారం రాత్రి నుంచి మిన్నెసోటాలో 23వ గాలి నాణ్యత హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశంలో గత జనవరి నుంచి 76,129 కిలోమీటర్లలో అటవీ సంపద కాలి బూడిదైంది. 1989 నాటి విపత్తు కంటే ఇదే అతి పెద్దది. అప్పట్లో 75,596 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించగా.. ప్రస్తుత కార్చిచ్చు ఆ రికార్డ్‌ను దాటిపోయింది. కెనడాలో విస్తరిస్తున్న కార్చిచ్చుతో అమెరికాలో వాతావరణం ఇబ్బందుల్లో పడింది. న్యూయార్క్ 413 వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)తో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది. స్కేల్‌పై గరిష్ఠ ఏక్యూఐ 500 అయితే.. న్యూయార్క్ నగరంలో వాయు కాలుష్యం 400 దాటిందంటేనే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీంతో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: 'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు.. -
పెరిగిన పామాయిల్ దిగుమతులు, ఎన్నిటన్నులంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పామాయిల్ దిగుమతులు స్వల్పంగా వృద్ది చెంది జూన్ మాసంలో 5,90,921 టన్నులు నమోదైంది. సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 12 శాతం ఎగసి 2.30 లక్షల టన్నులు, పొద్దు తిరుగుడు నూనె 32 శాతం తగ్గి 1.19 లక్షల టన్నులకు వచ్చి చేరింది. టారిఫ్ రేట్ కోటా కింద డ్యూటీ ఫ్రీ ముడి సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె దిగుమతులకై కేటాయింపులు పెంచాల్సిందిగా సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. క్రితం ఏడాదితో పోలిస్తే వంటలకు ఉపయోగించే నూనెలతోసహా అన్ని రకాల నూనెలు 9.96 లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది జూన్‌లో 9.91 లక్షల టన్నులకు దిగొచ్చాయి. మొత్తం దిగుమతుల్లో పామాయిల్ వాటా ఏకంగా 50 శాతముంది. టారిఫ్ రేట్ కోటా కింద 2022–23, 2023–24 సంవత్సరాలకుగాను ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనె ఒక్కొక్కటి 20 లక్షల టన్నులు దిగుమతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. -
‘మీ చెత్త మాకెందుకు?’.. దిమ్మతిరిగే షాక్
Sri Lanka Returns Tonnes Of Garbage: అక్రమంగా దిగుమతి అవుతున్న వేలాది టన్నుల వ్యర్థాలతో నిండిన అనేక వందల కంటైనర్లను శ్రీలంక సోమవారం బ్రిటన్‌కు పంపించిందని అధికారులు తెలిపారు. అవన్నీ బ్రిటన్ నుంచి వచ్చిన వ్యర్థాలు. 2017, 2019 మధ్య కాలంలో శ్రీలంకకు పెద్ద ఎత్తున చేరాయి. వాటిలో ఉపయోగించిన పరుపులు, తివాచీలు, రగ్గులు, మార్చురీల నుండి శరీర భాగాలతో సహా ఆసుపత్రుల నుండి బయోవేస్ట్ కూడా ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆ కంటైనర్ల నుంచి ఘోరమైన దుర్వాసన వస్తుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కొలంబో ఓడరేవులోని ఓడల్లో లోడ్ చేయబడిన కంటైనర్లలోదాదాపు 3 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నాయి. దీంతో కస్టమ్స్ చీఫ్ విజిత రవిప్రియ ఈ విషయమై స్పందించి.. "ఇలాంటి ప్రమాదకర వాటిని దిగుమతి చేసుకోం అప్రమత్తంగా ఉండటమే కాక మళ్లీ జరగకుండా చూసుకుంటాం." అని వివరణ ఇచ్చారు. అయితే కస్టమ్స్ ఒక స్థానిక సంస్థ బ్రిటన్ నుంచి వ్యర్థాలను దిగుమతి చేసుకుంటోందని చెబుతోంది కానీ కచ్చితమైన ఆధారాలను చూపించడంలో విఫలమైంది. ఈ క్రమంలో స్థానిక పర్యావరణ కార్యకర్త బృందం వ్యర్థాలను పంపినవారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే శ్రీలంక అప్పీల్ కోర్టు 2020లో ఆ పిటిషన్‌ను సమర్థించింది కూడా. ఈ నేపథ్యంలోనే శ్రీలంక ఆ వ్యర్థాలను యూకేకి తిరిగి పంపించేసింది. ధనిక దేశాలు చాలావరకు ఇలా చెత్తను దిగుమతి చేసి.. సముద్ర మార్గాల గుండా పంపించి చేతులు దులుపుకుంటాయి. ఈ క్రమంలో ఆసియా దేశాల్లో చాలావరకు ఇలాంటి చెత్త కంటెయినర్లు చేరి.. ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. శ్రీలంకలాగే.. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా కూడా దిగుమతవుతున్న వందలాది చెత్త కంటైనర్లను గతంలో ఆయా దేశాలకు తిరిగి పంపించాయి. (చదవండి: చంద్రుడిని ఢీ కొట్టనున్న రాకెట్!.మాది కాదంటున్న చైనా) -
నిలిచిన పామోలిన్ సరఫరా
ఎన్నికల వేళ పేద ప్రజలకు షాక్ డీడీలు కట్టిన రేషన్ డీలర్ల ఆందోళన 40 శాతం సరఫరా బంద్ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెలా పేదలకు పంపిణీ చేస్తున్న పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. విదేశాల నుంచి సరఫరా కావాల్సిన సరకు రాకపోవడంతో కొరత ఏర్పడింది. గత నెలలో సరకు రాకపోవడంతో జిల్లాకు ఏప్రిల్‌లో కోత విధించారు. దీంతో విజయవాడ నగరంలో, జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఏప్రిల్‌లో పామోలిన్ పంపిణీ జరగలేదు. జిల్లాలో ఏప్రిల్‌లో 1,178.47 టన్నుల పామోలిన్ సరఫరా కావాల్సి ఉండగా, 666.709 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 శాతం పామోలిన్ కోటా రద్దయింది. దీంతో విజయవాడ నగరంలోని 255 చౌక ధరల దుకాణాల్లో 201.670 టన్నుల పామోలిన్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, పెడన, గూడూరు, మండవల్లి, ఇబ్రహీంపట్నం, నూజివీడు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి మండలాలకు ఈ నెలలో పామోలిన్ సరఫరా కాలేదు. ఈ క్రమంలో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు నెలల్లో కూడా స్టాక్ రాదని అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో పామోలిన్ కోసం వేలాది రూపాయలు డీడీలు తీసి చెల్లించిన రేషన్ డీలర్లు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యే : జిల్లా డీఎం పామోలిన్ సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిందని జిల్లా పౌరసరఫరాల అధికారి చిట్టిబాబు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 32 శాతం మాత్రమే పామోలిన్ సరఫరా కాగా, జిల్లాలో 60 శాతం సరఫరా చేశామని తెలిపారు. విదేశాల సరకుతో కూడిన షిప్ రాకపోవటంతో సరఫరా నిలిచిపోయిందని ఆయన వివరించారు.