తెలుగుదేశం పార్టీ చందాల దందా | Thousands of crores scams by TDP Main Leaders Son | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం పార్టీ చందాల దందా

Published Wed, Feb 27 2019 3:55 AM | Last Updated on Wed, Feb 27 2019 10:20 AM

Thousands of crores scams by TDP Main Leaders Son - Sakshi

సాక్షి, గుంటూరు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేత తనయుడు అడ్డదారులు తొక్కుతున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీపడేందుకు అవసరమైన ఖర్చు భరించాలంటూ పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, భూస్వాములు, కాంట్రాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఆ ముఖ్యనేత తనయుడు వారికి హుకుం కూడా జారీచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా గుంటూరులోని ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌లో రెండు రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తూ భారీ మొత్తంలో చందాలు వసూలు చేసే కార్యక్రమానికి ఆయన తెరతీశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని చిన్నస్థాయి వ్యాపారుల నుంచి బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, భూస్వాములు ఇలా అన్ని వర్గాలకు చెందిన ముఖ్యులను గుంటూరుకు పిలిపించి వారి సామర్థ్యాన్ని బట్టి ఎంత చందా ఇవ్వాలనేది నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఇలా రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు చందాల జాబితాను తయారుచేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అందరిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతుండటంతో అంతా విస్తుపోతున్నారు. సమావేశంలో ముఖ్యనేత తనయునికి ఎదురు చెప్పలేక వారంతా సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లాలో ఓ ముఖ్యనేత తనయుని దెబ్బకు గత నాలుగున్నరేళ్లుగా  రెండు నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల వారు అల్లాడిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బిల్డింగ్‌ కట్టాలన్నా.. ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయాలన్నా.. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేయాలన్నా.. దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణం ఏర్పాటు చేసుకోవాలన్నా.. బార్‌ లైసెన్సు పొందాలన్నా.. ఆయనకు ‘కే’ ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. ఓ రైల్వే కాంట్రాక్టర్‌ పర్సంటేజీ ఇవ్వలేదనే కారణంతో పనులు నిర్వహించే ప్రాంతంలో రేకుల షెడ్డును కూల్చివేసి నిర్మాణ సంస్థ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులపై సైతం దాడులకు పాల్పడిన సంఘటన రాష్ట్రం మొత్తానికి తెలిసిందే. రైల్వే కాంట్రాక్టర్లు సాక్షాత్తు సీఎం, కేంద్ర రైల్వే శాఖామంత్రి దృష్టికి తీసుకెళ్లినా సదరు నేత ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ‘కే’ ట్యాక్స్‌లు కట్టకుండా ఎదురుతిరిగే వారిపై అక్రమ కేసులు బనాయించడం, దాడులకు సైతం తెగబడ్డ ఘటనలు అనేకం. ఇలా చెప్పుకుంటూపోతే నాలుగున్నరేళ్లలో సదరు ముఖ్య నేత తనయుని అరాచకాలకు అంతేలేదు. దీంతో వీరికి ఎదురుతిరిగే అధికారిగానీ, వ్యాపారస్తులుగానీ లేకుండాపోయారు.

ఈ నేపథ్యంలో.. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లతో గుంటూరు నగరంలోని ఓ ద్విచక్రవాహన షోరూమ్‌లో రహస్య సమావేశం నిర్వహించి ఎన్నికల ఖర్చు కోసం చందాలు ఇవ్వాలంటూ హుకుం జారీచేశారు. దీంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆయన చెప్పిన దానికి తలాడించి అక్కడ నుంచి బయటపడ్డారు. ఈ సమావేశంలో చిన్న వ్యాపారుల మొదలు బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.లక్షల్లో నిర్ణయించి చందాల జాబితా తయారుచేసినట్లు సమాచారం. జాబితా ప్రకారం డబ్బులు సిద్ధంచేసి పెట్టుకోవాలని తాము చెప్పిన సమయానికి, చెప్పిన వారికి ఆ డబ్బు అందించాల్సి ఉంటుందని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఎలా ఉన్నా, ఎన్నికల సమయంలోనైనా తమ జోలికి రాకుండా ఉంటారని భావించిన వ్యాపారులకు చందాలంటూ ముఖ్యనేత తనయుడు ఊహించని షాక్‌ ఇవ్వడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. లక్షలకు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ సన్నిహితుల వద్ద వారు వాపోతున్నట్లు సమాచారం. ఇవ్వలేమని చెబితే వారి స్పందన ఎలా ఉంటుందో తమకు తెలుసని, అందుకే ఏం మాట్లాడకుండా వచ్చేశామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నరసరావుపేటలోనూ హడల్‌
మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ వ్యాపారులు కూడా హడలిపోతున్నారు. ముఖ్యనేత తనయుడు సత్తెనపల్లి నియోజకవర్గానికే పరిమితమవుతారా.. తమను కూడా పిలిచి చందాలు అడుగుతారా అంటూ భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.వేల కోట్లు దోచేసిన ఆయన అందులో నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీయకుండా చందాల ద్వారా వసూలుచేసి ఆ మొత్తాన్ని ఎన్నికలకు ఖర్చుపెట్టడం ఏమిటని బాధితులు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement