పొంచి ఉన్న వరద ముప్పు | threat from floods water | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న వరద ముప్పు

Published Mon, Oct 14 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

threat from floods water


 శ్రీకాకుళం, న్యూస్‌లైన్
 ఒడిశాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షాలు కురియటంతో వంశధార నదికి వరద వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వాస్తవానికి.. నాగావళి, వంశధార, బాహూదా నదుల్లో నీటి ప్రవాహం ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి తగ్గుముఖం పట్టడంతో వరద ముప్పు తప్పినట్టేనని అధికారులు భావించారు. కానీ ఒడిశాలో వర్షాల కారణంగా సోమవారం ఉదయానికి పరిస్థితి మారి పోనుందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తు తం నాగావళి నదిలో శ్రీకాకుళం పాతవంతెన దగ్గర 5800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. వంశధార నదిలో గొట్టా బ్యారేజీ వద్ద మధ్యాహ్నం 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించగా సాయంత్రానికి 24 వేల క్యూసెక్కులకు తగ్గింది. అయితే, రాత్రి పది గంటలకు ఇది 51,454 క్యూసెక్కులకు పెరిగింది.
 
  ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షాలు కురియడంతో వంశధార నదికి వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తూ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మరో 10 వేల క్యూసెక్కుల నీరు అదనంగా చేరవచ్చని, దీనివల్ల వరద ప్రమాదం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. 60 వేల క్యూసెక్కుల నీరు వస్తేనే వరద ముప్పు ఉంటుంద ని, అయితే ముందు జాగ్రత్తచర్యగా కలెక్టర్ హెచ్చరిక జారీ చేశారని అంటున్నారు. ఒడిశాలో వర్షాలు కొనసాగితే ముప్పు తప్పదని పేర్కొంటున్నారు. ఇక, ఇచ్ఛాపురంలో ఉదయం ఉగ్రరూపం దాల్చిన బాహుదా నది, సాయంత్రానికి కొంత శాంతించింది. ఉదయం 58,500 క్యూసెక్కుల నీరు ప్రవహించగా సాయంత్రం 6 గంటల సమయానికి ప్రవాహం 54 వేల క్యూసెక్కులకు తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 1999లో 73 వేల క్యూసెక్కులు ప్రవహించగా ఆ తర్వాత ఆదివారం ఉదయం ప్రవహించిన 58,500 క్యూసెక్కులే అత్యధికం కావటం గమనార్హం. ఇదిలా ఉండగా పంట కాలువలన్నీ నీట మునిగి ఉండడంతో ప్రస్తుతానికి నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు.
 
 తుపాను నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం
 ఎల్.ఎన్.పేట(హిరమండలం), న్యూస్‌లైన్: జిల్లాను వణికించిన పై-లీన్ తుపాను చేకూర్చిన నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తుపానుల రాష్ట్ర పరిశీలకుడు ఎస్.ఢిల్లీరావు అన్నారు. హిరమండలంలోని వంశధార ప్రాజెక్టు వద్ద ప్రవాహ వేగాన్ని ఆదివారం పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తుపానుల నష్టాలను వెంటనే జిల్లా అధికారుల ద్వారా తమకు తెలియజేయూలని అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులకు ఆదేశించామన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురవగా మరికొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు మాత్రమే వీచాయన్నారు. గాలులు కారణంగా పంటలు నేలకొరిగిపోవడం, పురిపాకలు పడిపోవడం, చెట్లు, తోటలు నేలమట్టం కావడంతో రైతులకు నష్టం వాటిల్లిందని చెప్పారు. పూర్తి స్థాయిలో నష్టాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. పై-లీన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట హిరమండలం తహశీల్దారు డి.చంద్రశేఖరరావు వంశధార ఉద్యోగులు ఉన్నారు. వంశధార నదీతీర వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని డీఈ ఎస్. జగదీష్ తెలిపారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement