ఒరిస్సాలోని గిరిజన తెగ. కోచింగ్‌కు డబ్బులు లేవు. ఇంట్లో ఇంటర్‌నెట్ రాదు.కాని జీవితంలో ఏదైనా సాధించాలి. ఇంటికి, ఊరికి దూరంగా వెళ్లి మరీ సిగ్నల్ ఉన్న చోట కూచుని యూట్యూబ్ వీడియోల సాయంతో ‘ఒరిస్సా సివిల్ సర్వీసెస్’లో ఉద్యోగం సాధించింది బిని ముడులి. సోషల్ మీడియా వల్ల కలిగిన మేలు ఇది. ఒరిస్సాలో బోండా తెగ నుంచి స్టేట్ సివిల్స్‌లో ఉద్యోగం సాధించిన మొదటి మహిళ బిని పరిచయం...
ఒక్కొక్కరూ ఒక్కొక్కరూ వస్తూ ఉంటే కాసేపటికి ఆ బోండా ఘాట్ జనాలతో నిండిపోయింది. అందరూ బిని ముడులిని చూసి అభినందించేవారే. దిష్టి తీసేవారే. కారణం ఆ అమ్మాయి తమ బోండా తెగ గౌరవాన్ని పెంచింది. తమ తెగ నుంచి ‘ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్’ (ఓపిఎస్‌సి)లో ర్యాంక్ సాధించి గవర్నమెంట్ అధికారి అవుతున్న మొదటి అమ్మాయి బిని ముడులి.
‘నాకు ఉద్యోగం వస్తే నా కంటే మావాళ్లే ఎక్కువ ఆనందిస్తున్నారు’ అంటుంది 24 ఏళ్ల బిని ముడులి. మొన్నటి శనివారం విడుదలైన ఓపిఎస్‌సి ఫలితాల్లో ఎస్.టి. కోటాలో 596వ ర్యాంకు పొంది ఉద్యోగానికి అర్హత సాధించింది బిని. ఓపిఎస్‌సి 2022–23 పరీక్షకు మొత్తం 92,194 మంది అభ్యర్థులు ΄ోటీ పడితే వారిలో 683 మంది అర్హత సాధించారు. విశేషం ఏమిటంటే టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు మంది అమ్మాయిలున్నారు. అర్హత సాధించిన వారిలో 258 మంది అమ్మాయిలే.
యూట్యూబ్ పాఠాలతో
2020లో ఓపిఎస్‌సి పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యింది బిని. ‘నా ప్రిపరేషన్ సరి΄ోదని నాకు అర్థమైంది. కాని కోచింగ్‌కు వెళ్లేందుకు డబ్బు లేదు. అదీగాక నేను సంపాదించి ఇంటికి సాయపడాల్సిన సమయం. అందుకే ఆయుర్వేదిక్ అసిస్టెంట్‌గా పని చేయడం మొదలెట్టాను. మా ఊరిలో ఇంటర్‌నెట్ ఉండదు. అందుకే దగ్గరిలోని గోవిందపల్లి టౌన్‌కు వచ్చి అక్కడ యూట్యూబ్‌లో దొరికే పాఠాలతో ప్రిపేర్ అయ్యాను. ఆన్‌లైన్‌లో దొరికే మెటీరియల్‌ను చదువుకున్నాను. అనుకున్నది సాధించాను’ అంది బిని.
అమ్మాయిలను స్కూళ్లకు పంపండి
‘ఆడపిల్లలను బాగా చదివించండి అనేదే నా పిలుపు. చదువులోనే వారి అభివృద్ధి ఉంది. డబ్బు లేక΄ోయినా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఉచితంగా అనేక కోర్సులు, కోచింగ్‌లు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నేను అధికారి అయ్యాక స్త్రీల స్వయంసమృద్ధి కోసం పని చేస్తాను. అంతేకాదు మా బోండా తెగ కోసం వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల కోసం పని చేస్తాను’ అంది బిని.
వంటలు చేస్తూ పెంచాడు
ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో ముదులిపడ అనే చిన్న బోండాల ఊరు బిని ముడులిది. తండ్రి మధుముడిలి అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటచేస్తాడు. తల్లి సునమణి ఊళ్లో అంగన్‌వాడి కార్యకర్తగా పని చేస్తోంది. ఒరిస్సాలో మొత్తం 13 గిరిజన తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే వాటిలో ఒకటి బోండా తెగ.
ఆ తెగ నుంచి తాను బాగా చదువుకుని పైకిరావాలనుకుంది బిని ముడులి. జేపోర్‌లోని బిక్రమ్‌దేబ్ యూనివర్సిటీలో జువాలజీలో ఎంఎస్సీ చేసింది. ప్రభుత్వ అధికారి అయి ప్రజలకు సేవ చేయాలనేది బిని కల.
(చదవండి: వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!)
Comments
Please login to add a commentAdd a comment