నారాయణపురం లింక్ కాలువలో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు.
శ్రీకాకుళం రూరల్ మండల్ కనుగులవానిపేట సమీపంలోని నారాయణపురం లింక్ కాలువలో పడి మంగళవారం సాయంత్రం ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. కనుగులవానిపేటకు చెందిన అప్పారావు సోమవారం మృతిచెందాడు. మంగళవారం అతని అంత్యక్రియలు జరిగాయి.ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలవారు మంగళవారం సాయంత్రం స్నానంచేసేందుకు లింక్ కాలువకు వెళ్లారు. వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తూ కాలువలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మృతి చెందినవారిలో పార్వతీశం, పార్వతి దంపతుల కుమార్తె లావణ్య(9), కొడుకు మణికంఠ(7), త్రినాథరావు, లత దంపతుల కుమార్తె గీత(6) ఉన్నారు. మృతుల కుటుంబాలవారూ వ్యవసాయ కూలిపనులు చేసుకుని జీవించేవారు. పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.