ఆదివారం జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. వాహనాల వేగం వల్లే ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లిలో రెండో తరగతి చదువుతున్న కృష్ణవేణి (8) ఆటో దిగి రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డులోని పాపంపేట కాలనీకి చెందిన రోహిణి (7) సమీప బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఐషర్ వాహనం ఢీకొనడంతో వెనుక టైరు కింద పడి మృతిచెందింది. బళ్లారికి సమీపంలోని సంగనకల్లుకు చెందిన కుటుంబం పెనుకొండకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో బోల్తా పడి లతీఫ్ (13) అనే బాలిక చనిపోయింది.
వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కొద్ది క్షణాల వరకూ నవ్వుతూ, తుళ్లుతూ ఉల్లాసంగా తల్లిదండ్రులతో కనిపించిన ఆ పిల్లలను అంతలోనే మృత్యువు వాహనాల రూపంలో బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ సంఘటల్లో మృతి చెందిన వారంతా 7 నుంచి 13 ఏళ్లలోపు బాలికలే..
ఐషర్ ఢీకొని...
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: కళ్యాణదుర్గం రోడ్డులోని పాపంపేట కాలనీలో టూరిస్టు ఏజెంటుగా పని చేసే శివశంకర్, లలిత దంపతులు నివాసముంటున్నారు. వీరి కూతురు రోహిణి (7) ఆదివారం సెలవు కావడంతో తమ సమీప బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై ప్రధాన రహదారి వైపు వెళుతుండగా, కళ్యాణదుర్గం నుంచి నగరంలోకి వస్తున్న ఐషర్ వాహనం వెనుకవైపు నుంచి వచ్చి ఢీకొంది. ఈ సంఘటనతో ద్విచక్రవాహనం ముందువైపు కూర్చున్న రోహిణి జారి కిందపడింది, ఆమె కడుపు పైనుంచి ఐషర్ వాహనం వెనుక టైరు వె ళ్లడంతో తీవ్రంగా గాయపడింది. విషయం గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.దాంతో ఆగ్రహించిన స్థానికులు వాహన డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షణకాలం వరకూ తమతో గడిపిన కూతురు మృతి చెందినట్లు తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
సుమో బోల్తా పడడంతో...
కూడేరు, న్యూస్‌లైన్: కర్ణాటకలోని బళ్లారికి సమీపంలోని సంగనకల్‌కు చెందిన వన్నూర్‌సాబ్ కుటుంబ సభ్యులు ఆదివారం టాటా సుమోలో పెనుకొండలోని బాబయ్య స్వామి దర్గాకు బయలుదేరారు. కూడేరుకు రెండు కిలోమీటర్ల దూరంలో వెనుక చక్రం హఠాత్తుగా పంక్చర్ కావడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో అందులో ఉన్న లతీఫ్ (13) అనే బాలిక తీవ్రంగా గాయపడి మృతి చెందింది. వన్నూర్‌సాబ్‌తోపాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి వరకూ ఉల్లాసంగా కబుర్లు చెబుతూ ఉండిన చిన్నారి క్షణాల వ్యవధిలో మృతి చెందడడంతో ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు కలచివేసింది. స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూడేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని...
దామాజిపల్లి(చెన్నేకొత్తపల్లి)న్యూస్‌లైన్: దామాజిపల్లికి చెందిన నాగేంద్రమ్మ, ఆదినారాయణ దంపతుల రెండో కూతురు కృష్ణవేణి (8) స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఆదివారం ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ కాలనీలోని పిల్లలతో కలసి మండల కేంద్రానికి వచ్చింది. కార్యక్రమం అనంతరం అందరూ ఆటోలో గ్రామానికి చేరుకున్నారు. ఆటో దిగి రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు చిన్నారిని ఢీకొంది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బాలిక అవ్వ, తాత, తల్లిదండ్రులు భోరున విలపించారు. ఎస్‌ఐ దస్తగిరి సంఘటన స్థలాన్ని సందర్శించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ ప్రభాకర్, ప్రధానోపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.
మృత్యు వేగం..
Published Mon, Oct 21 2013 2:33 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement