సాక్షి నెట్‌వర్క్ : పెద్ద నోట్ల రద్దు పండుటాకుల ప్రాణాలకు ముప్పుగా మారింది. పింఛన్ సొమ్ము తెచ్చుకునేందుకు వెళ్లి ఇప్పటిదాకా ఏపీవ్యాప్తంగా 22 మంది వృద్ధులు పిట్టల్లా రాలిపోయారు. వీరిలో ముగ్గురు బుధవారం మృతి చెందారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తూంపాయనపల్లెకు చెందిన బి.రామన్న బోయుడు భార్య లక్షుమమ్మ(66) రెండేళ్లుగా పింఛన్ తీసుకుంటోంది. ఖాతా ప్రారంభించేందుకు 15 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. బుధవారం కుమారుడు సుబ్రమణ్యంతో కలసి బంగారుపాళ్యంలోని సిండికేట్ బ్యాంకు వద్దకు వచ్చింది. బ్యాంకు మెట్లు ఎక్కుతూ కళ్లు తిరిగి పడిపోయి మృతి చెందింది.
ఇదే రోజు గుంటూరు జిల్లా మాచర్లలోని రామాటాకీస్ లైనులో ఉన్న ఎస్‌బీఐలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి షేక్ మౌలాలి(73) నగదు కోసం క్యూలో నిల్చొని అస్వస్థతకు గురై మృతి చెందాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి డేరంగుల రంగయ్య (67) పింఛన్ కోసం బుధవారం నూనెపల్లె ఆంధ్ర బ్యాంకుకు వచ్చాడు. డబ్బు పొందలేక దిగాలుగా వెళుతూ రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లగానే అస్వస్థతకు గురై మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ‘నో క్యాష్’ బోర్డు పెట్టడంతో గత నెల 25వ తేదీన బాలరాజు(68) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఏపీలో ముగ్గురి మృతి
Published Thu, Dec 15 2016 3:49 AM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM
Advertisement